సీతంపేట/పార్వతీపురంరూరల్: జిల్లాలోని సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వేషధారణలు, డప్పువాయిద్యాలు అలరించాయి. ముందుగా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డితో పాటు అధికారులు, నాయకులు సీతంపేట అడ్వంచర్ పార్కు నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ చేశారు. ఐటీడీఏ ముఖద్వారం వద్ద ఉన్న అడవితల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వివిధ ప్రభు త్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ గిరిజనుల కోసం నిరంతరం పోరాడి అమరులైన గిరిజన నాయకులు బిర్సాముండా, అల్లూరి సీతారామరాజు, కొమరంబీమ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీవితంలో ఉన్నస్థాయికి ఎదగాలంటే విద్యార్థులంతా బాగా చదువుకోవాలన్నారు. సీతంపేట ఐటీడీఏ నుంచి టెన్త్ విద్యార్థినికి స్టేట్‌ఫస్ట్ రావడం ఎంతో ఆనందంగా ఉందాన్నరు. గిరిజనులు ఆరోగ్యం పట్లశ్రద్ధ వహించాలన్నారు. నాటుమందుల జోలికి పోవద్దన్నారు.
ప్రసవానికి ముందే గర్భిణులు వైటీసీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక హాస్టల్‌కు చేరుకోవాలన్నారు. ఏడాది పొడవునా దిగుబడి వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. అనంతరం టెన్త్, ఇంటర్‌లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే క్రీడలు, నృత్యాలు చేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి, ఏపీఓ చిన్నబాబు, డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కరరావు, ఎంపీపీ బి.ఆదినారాయణ, మార్కెట్‌కమిటీ చైర్మెన్ సంధ్యారాణి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.భూదేవి, గిరిజన నాయకులు కె.సుబ్బారావు, ఎం.రవికుమార్, ప్రమోద్, ఎం.భాస్కరరావు, కె.కాంతారావు, స్పోర్ట్స్ ఇన్‌చార్జి జాకాబ్‌దయానంద్, ఏఎంఓ కోటిబాబు, జీసీడీఓ రాములమ్మ పాల్గొన్నారు.
ఆదివాసీ వారసత్వాన్ని కాపాడుకోవాలి
పార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ ఆదావాసీ దినోత్సవంలో పీఓ అశుతోష్ శ్రీవాత్సవతో పాటు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, కురుపాం ఎమ్మెల్యే టి.జగదీశ్వరీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఆదివాసీ వారసత్వాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వసతిగృహాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందని, 10, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రగతి రాష్ట్రంలో మొదటి వరుసలో ఉందంటే ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల కృషి ఫలితమేనన్నారు. ఎస్పీ మాట్లాడుతూ గిరిజనుల జీవన విధానం ఎంతో సంప్రదాయంగా ఉంటుందని, అమాయకపు గిరిజనులు కొంతమంది అత్యాసపరుల మాటలు విని సారా, గంజాయి వంటి అక్రమ రవాణాల్లో భాగస్వాములై కటకటాలపాలవుతున్నారన్నారు. మాదకద్రవ్యాల రవాణాకు దూరంగా ఉండాలని సూచించారు.

ఆదివాసీ పండగ