
బీసీలపై టీడీపీ గూండాగిరి
పార్వతీపురం రూరల్: టీడీపీ మూకలు బీసీలపై గూండాగిరి చేయడంపై బీసీ నాయకులు మండిపడ్డారు. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని ఖండించారు. దీనికి నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎన్‌పీ కాలనీ వద్ద ఉన్న మహత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. అనంతరం జ్యోతిబాపూలే విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, జిల్లాలో ఉన్న బీసీ అనుబంధ విభాగాల నాయకులు మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగవిరుద్ధ పాలన సాగిస్తున్నారన్నారు. పులివెందులలో ఓటమి భయంతో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఓటర్లను భయపెట్టేందుకు దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ గూండాలు కిరాతకంగా వ్యవహరిస్తూ చట్టసభల్లో ఉన్న నాయకులపై రాక్షసత్వంగా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకులపై గత 14 నెలల్లో చంద్రబాబు హయాంలో అనేక దాడులు జరిగాయని, రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకు చూస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు బహిరంగంగా ఈ దాడికి సంబంధించి బీసీలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు మాధవరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, పాత గౌరీశంకరరావు, బొమ్మి రమేష్, నాగేశ్వరరావు, కాగాన ప్రకాష్, దేవులపల్లి నాగరాజు, కోరాడ శేఖర్, కోల సుధాకర్, షేక్ జలాల్, బడే శ్రీరాంజన్, ఏగిరెడ్డి రమణ, నేతాజీ, సుంకర అనిల్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడి విచారకరం
తక్షణమే టీడీపీ నేతలు బీసీలందరికీ క్షమాపణ చెప్పాలి
బీసీలపై దాడిని నిరసిస్తూ జ్యోతిరావుపూలే విగ్రహానికి వినతి