
6 తులాల బంగారు ఆభరణాల అప్పగింత
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేష్‌న్ క్రైమ్ పార్టీ సిబ్బంది ఫిర్యాదు అందిన కొద్ది గంటల వ్యవధిలోనే పోయిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి శుక్రవారం అప్పగించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలోని కామాక్షి నగర్ కు చెందిన పిల్ల పద్మ సొంత పని నిమిత్తం ఈనెల 7న సాయంత్రం కామాక్షినగర్ వద్ద ఆటో ఎక్కి నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద దిగింది. ఆటోలో బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో స్టేషన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, సిబ్బంది శ్రీను, రమణలు ఆటోను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ట్రేస్ చేశారు. ఆటో వెనక సీటు భాగంలో బ్యాగ్ ను గుర్తించడంతో పాటు అందులో ఆరు తులాల బంగారు ఆభరణాలను ఫిర్యాదురాలైన పిల్ల పద్మకు అప్పగించారు. బ్యాగును, విలువైన బంగారు ఆభరణాలను అప్పగించడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్పై సురేంద్ర నాయుడు, సిబ్బందిని సీఐ చౌదరి అభినందించారు.