
రియల్ ఎస్టేట్ వెంచర్లకు అక్రమ గ్రావెల్
పూసపాటిరేగ:
రియల్ ఎస్టేట్ యజమానులు తమ వెంచర్లకు అనుమతిలేని అక్రమ క్వారీయింగ్ గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. లక్షలాది రుపాయిలు విలువ చేసిన భూగర్భ ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోంది. నిత్యం వందలాది ట్రాక్టర్లు గ్రావెల్‌ను అనుమతి లేకుండా తవ్వకాలు చేసి తరలిస్తున్న సంఘటన కొల్లయివలస రెవెన్యూ పరిధిలో కొండను ఆనుకొని జరుగుతోంది. కొండను ఆనుకొని విలువైన గ్రావెల్ నిత్యం తరలించుకుపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, నూతనంగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు ఇక్కడ నుంచే గ్రావెల్‌ను తరలిస్తున్నారు. భారీ స్థాయిలో గ్రావెల్ తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సంబంధిత భూగర్భ గనుల శాఖ అధికారులు వున్నారా.. లేరా.. అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. భూగర్భ గనుల శాఖ అధికారులకు అక్రమ క్వారీయింగ్‌పై ఎవరైనా ఫిర్యాదు చేసినా సంబంధిత అక్రమార్కులకు క్షణాలలో సమాచారం వెళ్తుందనే ఆరోపణలు వున్నాయి. ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వున్నాయి. ప్రభుత్వ సహజ వనరులును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై వుంది. కానీ ఇక్కడ మాత్రం వింత పరిస్థితి నెలకొంది. గత కొంత కాలంగా కొల్లాయివలస కొండ నుంచి గుంపాం సమీపంలో రియల్ వెంచర్‌కు దర్జాగా గ్రావెల్ అనుమతి లేకుండానే తరలిపోతుంది. అక్రమ క్వారీయింగ్ దందా జరుగుతున్నా సంబంధిత అధికారుల కనీసం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని సహజ వనరులను కాపాడాలని సామాజిక వేత్తలు, ప్రజలు కోరుతున్నారు.