
వంగర తహసీల్దార్ సస్పెన్షన్
● విచారణ అధికారిగా కేఆర్‌సీ ఎస్‌డీసీ
● ఇన్‌చార్జ్‌గా రాజాం తహసీల్దార్‌కు
అదనపు బాధ్యతలు
విజయనగరం అర్బన్/వంగర: వంగర ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్.రమణారావుపై సస్పెన్షన్ విధిస్తూ కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణారావు విధి నిర్వహణలో ఉండగా కార్యాలయంలోనే మద్యం తాగినట్లు వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో కలెక్టర్ ఈ ఆదేశాలను జారీ చేశారు. వంగర మండలానికి ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా రాజాం తహసీల్దార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. అదే విధంగా ఈ వ్యవహారంపై విచారణాధికారిగా కేఆర్‌సీ ఎస్‌డీసీ మురళిని నియమిస్తూ ఆదేశాల్లో కలెక్టర్ పేర్కొన్నారు.
రహదారి భద్రతకు ప్రత్యేక డ్రైవ్
● ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకుని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్‌జిందల్ శుక్రవారం తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధారణ, బ్లాక్ స్పాట్స్ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు నమోదు చేసేందుకు, ఈ చలానాలు విధించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో రహదారి భద్రతకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.