జంఝావతి ఆయకట్టుదారుల గోడు వినండి బాబూ..
కొమరాడ: జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేసి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు డిమాండ్ చేశారు. ఆయకట్టు రైతులు, సమితి సభ్యులతో కలిసి జంఘావతి రబ్బరు డ్యామ్ వద్ద శుక్రవారం పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంపై నిరసన తెలిపారు. 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నిర్మాణం పూర్తయిన రబ్బర్‌డ్యాం వల్ల సుమారు 8 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిచేస్తే మరో 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఒడిశాతో ఉన్న వివాదం పరిష్కారం కాక ప్రాజెక్టు పూర్తికావడం లేదన్నారు. ప్రస్తుతం ఒడిశా, ఆంధ్రపదేశ్‌లో కూటమి ప్రభుత్వమే ఉందని, నాయకులు దృష్టిసారిస్తే ప్రాజెక్టు సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆ దిశగా స్థానిక కూటమి నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టు పూర్తయితే కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం మండలంలోని పలు గ్రామాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో సమితి కన్వీనర్ మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయుడు, వి.దాలినాయుడు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు.
జంఝావతి సాధన సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు
తక్షణమే ప్రాజెక్టు పూర్తిచేయాలని డిమాండ్


