సౌకర్యాలే కనం! | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాలే కనం!

Dec 25 2025 8:29 AM | Updated on Dec 25 2025 8:29 AM

సౌకర్

సౌకర్యాలే కనం!

సౌకర్యాలే కనం!

జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం చర్యలు కనీస సౌకర్యాలు, రక్షణ శూన్యం వెళ్లేందుకు రహదారీ కరువే

సాక్షి, పార్వతీపురం మన్యం :

జిల్లాలో సహజ వనరులకు కొదవ లేదు. కొండకోనలు, జాలువారే జలాపాతాలతో ఆహ్లాదం పంచుతుంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే.. జిల్లాను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయవచ్చు. గత కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ప్రస్తుత కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి.. జిల్లా పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించారు. అందులో భాగంగా బాహ్య ప్రపంచానికి తెలియని జలపాతాలను వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పించారు. ప్రస్తుత కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. బాధ్యతలు స్వీకరించినది మొదలు.. జిల్లాలో ఉన్న జలపాతాలను వెలికి తీసి.. పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని సీతంపేట, సాలూరు, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో దండిగాం, దళాయివలస, సున్నపుగెడ్డ, మెట్టుగూడ, మల్లి, బెనరాయి, తాడికొండ, శిఖపరువు, కురుకుట్టి, లొద్ద, తోణాం వంటి ప్రధాన జలపాతాలు 20 వరకు ఉన్నాయి. కొండలు, గుట్టలతో ఆ ప్రాంతాలు చూపురులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పిక్నిక్‌ల సమయంలో ఈ కేంద్రాలన్నీ కిటకిటలాడుతాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పం మంచిదే అయినా.. అక్కడికి వెళ్లేందుకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో చేసే ప్రయత్నాలన్నీ వృథాగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

ఆనందం వెంటే.. ప్రమాదం

ఆహ్లాదం వెంటే ప్రమాదం కూడా పొంచి ఉంది. యువత, పిల్లలు జలకాలాడుతూ, పై నుంచి రాళ్ల ద్వారా కిందకు జారుతున్నారు. ఈ సమయంలో ఎక్కువగా గాయాలపాలవుతున్నారు. యువత ఎక్కువగా మద్యం మత్తులోనే ఉంటారని స్థానికులు చెబుతుంటారు. పూటుగా తాగిన మత్తులో ప్రమాదకర ప్రాంతంలోకి ఈతకు దిగి, మునిగిపోయిన సందర్భాలు అనేకం. ఇవేకాక.. జంఝావతి రబ్బర్‌ డ్యాం, తోటపల్లి ప్రాజెక్టు వద్ద కూడా పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. జంఝావతి రబ్బర్‌డ్యాం వద్ద ఇటీవలే విహార యాత్రకు వెళ్లి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జలపాతాలు, ప్రాజెక్టుల వద్ద కనీస రక్షణ చర్యలు ఉండటం లేదు. హెచ్చరిక బోర్డులు పెట్టినా.. యువత వినిపించుకునే పరిస్థితి లేదు.

అటవీశాఖ అనుమతులున్నవెన్ని?

అటవీశాఖ పరిధిలో ఉన్న ఏ ప్రాంతంలోనైనా పర్యాటకంగానూ, ఇతర పనులు చేపట్టాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లాలో జలపాతాల గుర్తింపు, అభివృద్ధి అంటూ హడావిడి చేస్తున్న యంత్రాంగం.. అటవీశాఖ అనుమతులు లేకుండానే చాలా వరకు పనులు చేపట్టేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం అటవీశాఖ ఆధ్వర్యంలో సున్నపుగెడ్డ వద్ద జలపాతానికి రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆర్చ్‌ ఏర్పాటు చేశారు. ఇంకొంత పనులున్నాయి. మిగిలిన ఎక్కడా ఆ శాఖ కనీస అనుమతులు కూడా లేనట్లు తెలుస్తోంది. సంబంధం లేని డీఆర్‌డీఏ శాఖను ఇందులో భాగస్వామ్యం చేయడం విమర్శలకు తావిస్తోంది.

●ఎకో టూరిజం ప్రకారం ఎకో డెవలప్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానికులకే శిక్షణ ఇచ్చి గైడ్స్‌గా నియమించాలి. పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారికి జీతాలు, అక్కడ సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తారు. కొండకోనల ప్రాంతంలో జంతువులు సంచరించే అవకాశం ఉంటుంది. తగిన హెచ్చరిక, రక్షణ చర్యలు తీసుకోవాలి. జలాపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. కనీస నిబంధనలు పాటించాలి. చాలా వరకు జలాపాతాల వద్ద ఇవేవీ అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

●దళాయివలస, శిఖపరువు వద్ద టికెట్‌ పెట్టి మనిషి వద్ద రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాలోకి వెళ్తుందో తెలియడం లేదు.

సౌకర్యాలే కనం! 1
1/2

సౌకర్యాలే కనం!

సౌకర్యాలే కనం! 2
2/2

సౌకర్యాలే కనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement