రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
రేగిడి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన నడుపుతోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మాజీ ముఖ్యమంత్రిపై ఉన్న అక్కసుతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసి ప్రజలను, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రేగిడి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇంటి వద్దే అందించిన రేషన్ బళ్లును రద్దు చేసి మళ్లీ రేషన్ దుకాణాల వద్దకే సరుకులు తీసుకునేందుకు ప్రజలను పంపించేందుకు నిర్ణయం తీసుకోవడం హేయమైన చర్యన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు దూరం చేయడానికే ఎండీయూ వాహనాల రద్దు నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేషన్ సరఫరా కోసం ఎండీయూ వాహనాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి నేరుగా సరుకులు సరఫరా చేసేవారన్నారు. ఇప్పుడు ఆ వాహనాలు రద్దు చేయడం వలన ప్రజలు ప్రభుత్వ సేవలకు దూరం అవుతారని పేర్కొన్నారు. జిల్లాలో 370 వాహనాలు రద్దు చేయడం వలన వాహన నిర్వాహకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకపోగా రాష్ట్రంలో ఈ వాహనాల రద్దుతో మరికొంతమందిని నిరుద్యోగులను చేసిందన్నారు. జిల్లాలో 1249 రేషన్ డిపోల్లో మళ్లీ పాత పద్ధతినే కొనసాగిస్తుండడంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి వచ్చి సరుకులు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడంతో ఇటువంటి వారికి సరుకులను ఎలా అందజేస్తారని అన్నారు. ఎండీయూ వాహనాల రద్దుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెనాయుడు, మండల పార్టీ కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు ఉన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్


