ముందస్తు జాగ్రత్తలతో చోరీలకు అడ్డుకట్ట
పార్వతీపురం రూరల్: ప్రజలు తీర్థ యాత్రలు, వేసవి విహార యాత్రలకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలకు అడ్డుకట్ట వేయొచ్చని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పలు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు, ప్రయాణికులకు పోలీసు శాఖ ద్వారా శనివారం అవగాహన కల్పించారు. ఇళ్లల్లో వృద్ధులు, చిన్నారులను విడిచిపెట్టి బయటకు వెళ్లడం వల్ల మాటు వేసిన దొంగలు గమనించి చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దీన్ని గుర్తించి ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. చోరీల నియంత్రణకు పలు సూచనలు చేశారు. ఇళ్లకు తాళం వేసి సొంత గ్రామాలకు లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచి వెళ్లకూడదు. పరిసరాల్లో, వీధుల్లో కచ్చితంగా నిఘా కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లల్లో వృద్ధులను, చిన్న పిల్లలను విడిచిపెట్టి వెళ్లకూడదు. అత్యవసరమైతే ఇరుగు, పొరుగు వారిని గమనిస్తూ ఉండమని చెప్పాలి. బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో సీసీ కెమేరాలతో పాటు 24/7 సెక్యూరిటీ గార్డులతో రాత్రి వేళల్లో రెస్కీని ఏర్పాటు చేసుకోవాలి. ఉక్కబోత దృష్టిలో ఇంటి బయట, మిద్దెలపై పడుకొనేటప్పుడు ఇంట్లో వున్న విలువైన వస్తువులపై తగు భద్రత చర్యలు తీసుకోవాలి. ఇళ్లకు నాసిరకం తాళాలు వాడకుండా, తాళం వేసినట్లు కనబడకుండా కర్టెన్స్ ద్వారా జాగ్రత్తలు తీసుకొని ఇళ్లకు సంబంధించిన ప్రధాన గేట్లుకు లోపల భాగం ద్వారా లాక్ చేసుకొని వెళ్లాలి. అశ్రద్ధతో ఊళ్లకు వెళ్లే సమయంలో తాళాలను పూల కుండీల్లో, మ్యాట్స్ కింద, చెప్పుల స్టాండ్‌ల్లో పెట్టకూడదు. వాహనాలు పార్క్ చేసేటప్పుడు వీలైనంత మేరకు నిఘా ఉన్నచోట పార్క్ చేసేందుకు ఏర్పాటు చేసుకొని కచ్చితంగా హ్యాండిల్ లాక్ చేసి వెళ్లాలి. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్టు గుర్తిస్తే తక్షణమే సమీపంలో వున్న పోలీసుస్టేషన్‌కు లేదా డయల్ 100/112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. కచ్చితంగా జాగ్రత్తలు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ మేరకు ఎస్పీ ఆదేశాలతో సీసీఎస్ సీఐ అప్పారావు, క్రైమ్ ఎస్‌ఐ సూర్యారావు తదితర సిబ్బంది ఆర్టీసీ కాంప్లెక్స్, పలు బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణికులకు అవగాహన కల్పించారు.
ఎస్పీ మాధవ్‌రెడ్డి
ముందస్తు జాగ్రత్తలతో చోరీలకు అడ్డుకట్ట


