20న దేశ వ్యాప్త సమ్మె
● కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఐక్య వేదిక పిలుపు
విజయనగరం గంటంస్తంభం: లేబర్ కోడ్‌ల రద్దు, ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనం రూ.26,000, సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ తదితర డిమాండ్లపై ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలని కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల వేదిక నాయకులు పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్మి ఎ.జగన్మోహన్ అధ్యక్షతన స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో జిల్లా సదస్సు శనివారం జరిగింది. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన వారికి, భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన వీర జవాన్లకు రెండు నిమిషాలు మౌని పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద బహుముఖ దాడి చేపట్టిందన్నారు. 95 శాతంగా ఉన్న కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చే విధంగా కార్మిక చట్టాలు, హక్కులపై దాడి జరుగుతుందన్నారు. కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా, పని గంటలతో సంబంధం లేకుండా బానిసలుగా చేసే పరిస్థితి నేడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను, సమ్మె చేసే హక్కును, కనీస వేతనాలు సాధన కోసం, ప్రభుత్వ రంగాన్ని కాపాడేందుకు ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులు తమ్మనేని సూర్యనారాయణ, వెంకటేశ్వరావు, శంకరరావు, ఈశ్వరరావు, రవికుమార్, గీత, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


