16.12శాతం వృద్ధి సాధనే లక్ష్యం
పార్వతీపురంటౌన్: జిల్లాలో 16.12 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ప్రగతిపై తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గతే డాది తలసరి ఆదాయం రూ.1,67,543లు కాగా, ఈ ఏడాది రూ.1,94,048లుగా అంచనా వేస్తూ వృద్ధి రేటు 16.12 శాతం సాధించేందుకు కృషిచేస్తున్నామన్నారు. జిల్లాలో 49.27 శాతం ప్రాథమిక రంగం (వ్యవసాయ, అనుబంధ రంగాలు), 9.09 శాతం పారిశ్రామిక, 41.64 శాతం సేవా రంగాల నుంచి వృద్ధి ఉండబోతుందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి సాధంచేందుకు కృషిచేస్తున్నామన్నారు.
డ్వాక్రా సీ్త్రనిధి, ఐటీడీఏ నిధుల నుంచి గొర్రెలు, పశువులు, కోళ్లు పెంపకం వంటి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద 128.91 లక్షల పనిదినాలు సృష్టించబడ్డాయన్నారు. గతేడాది కంటే 5 లక్షల పనిదినాలు అధికంగా చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో 280 ప్రధాన ట్యాంకులు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడంతోపాటు ఆక్రమణలు తొలగింపుపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకుడు కె.రామచంద్రరావు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
జిల్లాలో మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. గృహ నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు, ఇంజినీరింగ్ పనులు తదితర అంశాలపై మండల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 7,134 మరుగుదొడ్లు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 4 వేల గృహాలను మూడు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సాలూరు మున్సిపాలిటీలో 437 మందికి, పార్వతీపురం మున్సిపాలిటీలో 548 మందికి, పాలకొండలో 197 మందికి అదనపు సహాయం చేసినట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, కేఆర్‌ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డా.ధర్మచంద్రారెడ్డి, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్


