పరిశుభ్రతతోనే ఆరోగ్యం
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్ది
పార్వతీపురం టౌన్: పాఠశాలల్లో విద్యార్థులు చేతులు కడుక్కునే కార్యక్రమం ప్రతి ఇంటిలో పక్కాగా జరగాలని, దీనికోసం ‘ఫ్యామిలీ ముస్తాబు‘ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. స్థానిక లూథరన్ చర్చి పక్కన ఉన్న సమావేశ మందిరంలో ‘ఫ్యామిలీ ముస్తాబు’పై సోమవారం శిక్షణ ఇచ్చారు. పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రతి ఫ్రైడేను డ్రైడే పాటించాలని కోరారు. సమష్టిగా దోమల నిర్మూలన చర్యలు చేపడితే మలేరియాను అరికట్టవచ్చన్నారు. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందాలని, నాటువైద్యం సరికాదన్నారు. డిగ్రీ తరువాతే తల్లితండ్రులు అమ్మాయిలకు వివాహం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటర్‌ఫెయిలైన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్‌డీఏ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు ఎం.సుధారాణి, కె.రామచంద్రరావు, టి.కనకదుర్గ, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి ఎస్.మన్మథరావు, జిల్లా మత్య శాఖాధికారి టి.సంతోష్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన పాఠశాలలకు
ప్రత్యేక గుర్తింపు
పార్వతీపురం: విద్యార్థుల ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపే పాఠశాలల్లోని ఉపాధ్యాయులను గుర్తించి వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌డే సందర్భంగా ప్రశంసాపత్రాను అందజేస్తామని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే పాఠశాలల్లోని ఉపాధ్యాయులను గౌరవిస్తామన్నారు.


