పాలకొండలో మైనింగ్ దందా
ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరిపై
కలెక్టర్‌కు ఫిర్యాదు?
అధికార బలంతో పాలకొండలో మైనింగ్, ఇసుక దందాపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమాలను ఆధారాలతో సహా వివరించారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్న నేతల తీరు బట్టబయలైంది. స్వయంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఫిర్యాదు చేశారంటే జిల్లాలో సాగుతున్న అక్రమాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
● కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూదేవి ● ఇసుక, మైనింగ్ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు
సాక్షి, పార్వతీపురం మన్యం: పాలకొండలో అక్రమ మైనింగ్ సాగుతోంది.. ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.. గోపాలపురం, అంపిలి గ్రామాల వద్ద నాగావళి నదిని యంత్రాలతో గుల్లచేస్తున్నారు.. రాత్రీపగలు తేడాలేకుండా లారీలు, ట్రార్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.. అధికారులు కొన్ని వాహనాలను సీజ్ చేసినా పరిస్థితిలో మార్పులేదంటూ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. మైనింగ్ ఏడీకి తెలిసే ఇదంతా జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి మైనింగ్ ఇసుక తవ్వకాలు ఎమ్మెల్యే జయకృష్ణ వర్గం కన్నుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. జేసీబీలతో తవ్వి, లారీలతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు లేకపోవడంతో ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. ఇదే విషయమై భూదేవి వర్గం సాక్ష్యాలతో సహా కలెక్టర్ దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది.
కలెక్టర్‌ను కలసిన అనంతరం పడాల భూదేవి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. పార్టీ ఇన్‌చార్జిగా తనకూ బాధ్యతలున్నాయని.. కార్యకర్తలకు తాను కూడా సమాధానం చెప్పుకోవాలని తెలిపారు. నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కూటమి అంటే అందరూ కలిసే.. అందరి భాగస్వామ్యంతో పనులు చేయాలన్నారు. నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. గృహాలు, పింఛన్లు, ఇటీవల పంపిణీ చేసిన రేషన్ కార్డుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టిలో కూడా పెడతామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల పాలకొండ నియోజకవర్గంలో పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అలకలు వీడి, అంతా కలసికట్టుగా పని చేయాలని హితవు పలికారు. నియోజకవర్గంలో అంతా ఏకపక్షమేనని.. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తమను కలుపుకొని వెళ్లడం లేదని తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి భూదేవి పలుమార్లు బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరు, అవినీతి, అక్రమాల పాలనను ఆమె కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లారు.
పడాల భూదేవి వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డిని కలిసి ముస్తాబు కార్యక్రమం నిర్వహణలో అభినందించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, ఎమ్మెల్యే జయకృష్ణ ఏకపక్ష వైఖరిపై ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గృహాల మంజూరు విషయం తమకు తెలియడం లేదని.. అర్హులకు అందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలెవరికీ ఇల్లు, పింఛన్లు రానీయకుండా ఎమ్మెల్యే వర్గం ఇబ్బందులు పెడుతున్నట్లు వివరించారు. గోశాలల విషయంలోనూ టీడీపీ కార్యకర్తలను వెనక్కి పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమాచారం తమ కార్యకర్తలకు తెలియడం లేదని.. దీని వల్ల ప్రజలకు ఆ ప్రయోజనాలు, లబ్ధి వివరించలేకపోతున్నామని చెప్పా రు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ తనకు ఏ కార్యక్రమాల సమాచారమూ చెప్పడం లేదని వివరించారు. అధికారులైనా సమన్వయం చేసుకుని వెళ్లాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిసింది.
పాలకొండలో మైనింగ్ దందా
పాలకొండలో మైనింగ్ దందా
పాలకొండలో మైనింగ్ దందా


