రాజ్యాంగ హక్కులను హరించడమే..
కురుపాం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీన పరచడం అనేది రాజ్యాంగబద్ధంగా గ్రామీణ కార్మికులకు కల్పించిన హక్కులను హరించడమేనని, ఇది ఆదివాసీ, ఆర్థికంగా అనగారిన ప్రజల జీవన గౌరవంపై నేరుగా దాడి చేయడమేనని మాజీ కేంద్ర మంత్రి, జాతీయ ఉపాధి హామి పథకం రూపకల్పన కమిటీ సభ్యుడు వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణదేవ్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణతో పాటు నిరుపేదలకు ఆహార భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. తను గిరిజన వ్యవహారాల, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన ప్రాంతాల్లో సమస్యలు అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో 150 రోజుల పనిదినాలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న చర్యలు సరైనవి కాదన్నారు. ఈ పథకం పేదల కోసం ఇచ్చే దానధర్మం కాదని, గ్రామీణ పేదలు, ఆదివాసీలు, దళితులు, చిన్నసన్నాకారు రైతులు, ఆర్థిక బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే హక్కుల ఆధారిత చట్టమన్నారు. గ్రామీణ కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధి హామీ రూపకల్పన కమిటీ సభ్యుడు కిశోర్ చంద్రసూర్యనారాయణ దేవ్


