మిల్లరు దయతలిస్తేనే..
● ధాన్యమిచ్చిన మూడు రోజులైనా ఖాతాకు జమకాని డబ్బులు
సాక్షి, పార్వతీపురం మన్యం: ధాన్యమిచ్చిన 48 గంటల్లో కాదు.. 4 గంటల్లో రైతుల ఖాతాకు డబ్బులు జమచేస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెబుతున్నారు. ప్రభుత్వం డబ్బులు ఎలా జమ చేస్తున్నా.. జిల్లాలో మాత్రం రైస్ మిల్లర్ల దయాదాక్షిణ్యాల మీదే అది ఆధారపడి ఉంది. మిల్లర్ల దోపిడీపై ఎన్ని విమర్శలొస్తున్నా.. ఏ ఒక్కరూ వెరవడం లేదు. అధికారుల సహకారంతో సంపూర్ణ దోపిడీకి పాల్పడుతున్నారు. సీతానగరం మండలం జగ్గునాయుడుపేట, ఆర్.వి.పేట రైతులు శంబంగి దమయంతి, యాండ్రాపు లావణ్య, పెంట సావిత్రమ్మ, పెంట పార్వతిలు రామవరం రైతు సేవా కేంద్రం ద్వారా ఈ నెల 20న ధాన్యమిచ్చారు. అదే రోజు ట్రక్‌షీట్ ద్వారా 304 బస్తాలు నిర్ధారించారు. బూర్జకు చెందిన చిన్నమ్మతల్లి మోడ్రన్ రైస్‌మిల్లుకు పంపించారు. మూడు రోజులైనా ఆ ధాన్యానికి గుర్తింపు ఇవ్వలేదు. నేటికీ డబ్బులు రాకపోవడంతో రైతులు రామవరం రైతు సేవా కేంద్రం సిబ్బందిని ప్రశ్నించారు. తమకేమీ సంబంధం లేదని.. మిల్లు యజమానితో మాట్లాడుకోండని వారు బదులిచ్చారు. మిల్లు వద్దకు వెళ్లి ఆరా తీస్తే.. రూ.4,800 అదనంగా కట్టాలని, లేకపోతే ధాన్యం వచ్చినట్టు గుర్తించడం(అక్నాల్జ్) చేయడం కుదరదని తేల్చిచెప్పారు. తేమశాతం కారణంగా ఒక బస్తాకు 43 కేజీల చొప్పున లెక్క కట్టి.. అదనపు ధాన్యం తీసుకోవడమే కాక.. ఆ మొత్తం చెల్లించాలని అంటున్నారని రైతులు వాపోతున్నారు.
మిల్లరు కారణంగా డబ్బులు రాలేదని చెబుతున్న దమయంతి, పెంట పార్వతి
మిల్లరు దయతలిస్తేనే..


