వినియోగానికి నోచుకోని నిధులు
● వీరఘట్టం మేజర్ పంచాయతీలో
మూలుగుతున్న నిధులు
● అభివృద్ధి పనులపై దృష్టి సారించని
పాలకవర్గం
వీరఘట్టం: జిల్లాలోని అత్యధిక జనాభా ఉన్న వీరఘట్టం మేజర్ పంచాయతీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు ఈ పంచాయతీలో పాలన చేసి ప్రజలందరిచే శభాష్ అనిపించుకున్నారు. అయితే ప్రస్తుతం షాడో పాలనలో ఉన్న ఈ మేజర్ పంచాయతీలో నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగానికి నోచుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.98 లక్షలు.. అలాగే జనరల్ ఫండ్ నిధులు సుమారు రూ.28 లక్షలు మూలుగుతున్నాయి. మొత్తం వీరఘట్టం మేజర్‌పంచాయతీ ఖజానాలో రూ.1.26 కోట్లు ఉన్నాయి. అయినా ఈ నిధులు అభివృద్ధి పనులకు ఉపయోగించకపోవడం శోచనీయం.
అభివృద్ధి చేయాల్సిన కొన్ని పనులు..
స్థానిక కొత్త బస్టాండ్‌లో కల్వర్టు చాలా ఏళ్ల కిందట కూలిపోయింది. దీన్ని బాగు చేయాల్సి ఉంది. అలాగే రెల్లివీధి సమీపంలో ఉన్న శ్మశానవాటిక రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. శ్మశానవాటిక పరిసరాలు కూడా దారుణంగా ఉన్నాయి. దీంతో శ్మశానవాటికకు వెళ్లే సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలా వీధుల్లో వీధి కుళాయిలు పాడయ్యాయి. ట్యాప్‌లు లేక తాగునీరు వృథాగా పోతోంది. వీటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ జంక్షన్ నుంచి బార్నాలవీధి రోడ్డు దారుణంగా ఉంది. అలాగే సెగిడివీధి నుంచి రెల్లివీధి మీదుగా బీసీ కాలనీకి వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. యల్లంకి వీధిలో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియలకు అష్టకష్టాలు పడాల్సిందే. శ్మశానవాటికకు సరైన రహదారి సౌకర్యం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు పరిష్కారానికి ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు స్పందించి అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ప్రతిపాదనలు చేశాం..
పంచాయతీలో రూ.1.28 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటితో కొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ఇటీవల రూ.30 లక్షలతో ప్రతిపాదనలు చేశాం. టెక్నికల్ అనుమతులు వస్తే పనులు ప్రారంభిస్తాం.
– బి.కోటేశ్వరరావు, పంచాయతీ ఇన్‌చార్జ్ ఈఓ
వినియోగానికి నోచుకోని నిధులు
వినియోగానికి నోచుకోని నిధులు
వినియోగానికి నోచుకోని నిధులు


