గంజాయి సరఫరా చేసే వ్యక్తి అరెస్ట్
విజయనగరం క్రైమ్: మూడేళ్ల కిందట నమోదైన కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయి సరఫరా చేసే గోపాల్ అనే వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 2022లో గంజాయి సరఫరా చేస్తూ పిపెండస్, శిశుమహర్ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు జిల్లా మేకవరం పంచాయతీకి చెందిన గోపాల్‌గా పోలీసులు నిర్ధారించారు. ఈక్రమంలో గోపాల్‌ను శనివారం జిల్లా కేంద్రంలో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
12 కిలోల గంజాయి స్వాధీనం
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి ఆటోస్టాండ్ సమీపంలో కొంతమంది వ్యక్తుల నుంచి రెండు చిన్న బ్యాగులలో ఉన్న సుమారు 12 కిలోల గంజాయిని పెదమానాపురం పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఎస్సై జయంతి వద్ద ప్రస్తావించగా.. గంజాయి స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని, అయితే నిందితులు తప్పించుకుపోవడంతో, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.


