40–50 సంవత్సరాల నుంచి కొండ భూములను సాగు చేసుకుంటున్నాం. జీడి తోటలు వేసుకుని, ఆ ఫల సాయంతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. గత ప్రభుత్వం మా మీద దయతలచి.. సాగు భూమి పత్రాలు మంజూరు చేసింది. వాటి మీద జగన బొమ్మ ఉందని ఆలోచిస్తున్నారో.. ఏమిటో అధికారులు? పట్టాలను ఆన్‌లైన్‌లోకి ఎక్కించడం లేదు. ఏడాది క్రితం ఇచ్చిన డీకేటీ పట్టా పత్రాలను ఇప్పటికీ ఆన్‌లైన్ చేయకపోవడం వల్ల అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ.. మక్కువ మండలం మూకవలస గ్రామానికి చెందిన మెల్లిక రాజారావు, సీతారాం, అంబటి వెంకటమ్మ, పావతి, సావిత్రి, అంబటి గోపాలం తదితర 15 కుటుంబాల వారు వాపోతున్నారు. రైతుభరోసా, ఇతర పథకాలేవీ అందడం లేదని.. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. మరోమారు వారంతా కలెక్టర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.


