ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం..
● నగదు అందిస్తేనే కొనసాగింపు
● ఉపాధి హమీ వేతనదారుల వద్ద నుంచి రూ. వంద వసూలు చేయాలని అల్టిమేటం
● ఏపీఓ ఆదేశాల ప్రకారం నగదు వసూలు చేస్తున్న ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు
మణ్యపురిపేట సీనియర్ మేట్‌గా పనిచేసిన గార రామలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం రూ. 50 వేల నగదును రెండు నెలలు కిందట మండల ఉపాధి హమీ అధికారి కామేశ్వరరావుకు ఇచ్చింది. అయితే మరో రూ. 10 వేలు ఇవ్వాలని అతను డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన నగదు ఇవ్వకపోవడంతో గ్రామానికి చెందిన మరో మహిళకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందజేశారు. ఆమె వద్ద నుంచి రూ. 30 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నగదు తీసుకున్న విషయం ఎంపీడీఓ, ఉపాధి హమీ పీడీలకు బాధితురాలు రామలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి విచారణ చేపట్టలేదు. జిల్లా అధికారి నుంచి మండల అధికారి వరకు వసూలు చేసిన నగదు సర్దుబాటు అవుతుందని సమాచారం. అందుకే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో బాధితురాలు రామలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఈఓపీఆర్‌డీ అన్నపూర్ణాదేవి మన్యపురిపేట పంచాయతీ కార్యాలయంలో శనివారం విచారణ చేపట్టారు.
గుర్ల:
గ్రామాల్లో పేదలందరికీ వంద రోజుల పని కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వంద రోజుల పని నుంచి వారానికి రూ. వంద వసూలు చేసే సరికొత్త పథకాన్ని గుర్ల మండల ఉపాధి హమీ అధికారులు ప్రవేశ పెట్టడం విమర్శలకు దారితీస్తోంది. మండలంలోని 42 గ్రామ పంచాయతీలలో ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయి. ఈ గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు వేతనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు. వేతనదారులు సక్రమంగా పని చేయడం లేదని బెదిరిస్తూ వారిని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారానికి రూ. వంద నగదు ఇస్తే తక్కువ పని చేసినప్పటికీ టెక్నికల్ అసిస్టెంట్ సహాయంతో కొలతలను అధికంగా వేసి ప్రభుత్వం ప్రకటించిన గరిష్ట వేతనాన్ని మీఖాతాలో జమ అయ్యేలా ఆన్‌లైన్ చేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు వారికి చెబుతున్నారు. నగదు ఇస్తున్నట్లు స్థానిక నేతలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగదు వసూలుపై ఎవరైనా వేతనదారులు ప్రశ్నిస్తే సాంకేతిక కారణాలు చూపి ఉపాధి హమీ పనులకు వెళ్లకుండా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.