దొరికినవి శాంపిల్‌ మాత్రమే! | - | Sakshi
Sakshi News home page

దొరికినవి శాంపిల్‌ మాత్రమే!

Oct 2 2026 2:57 AM | Updated on Oct 2 2026 2:57 AM

మందుల శాంపిళ్ల మాటున చీకటి దందా

నాట్‌ఫర్‌ సేల్‌ అయినా అమ్మకాలు రాష్ట్రస్థాయి అధికారి వస్తేగాని కదలని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు జిల్లాలో వందలు ఉండగా నాలుగు దుకాణాల్లోనే తనిఖీలు విశాఖలో పట్టుబడ్డ అక్రమ మందుల మూలాలు నరసరావుపేటలో..

ట్రెమటాల్‌ దొరికింది ఇక్కడే..

మందుల శాంపిళ్ల మాటున చీకటి దందా

నరసరావుపేట టౌన్‌: అక్రమ ఫిజీషియన్‌ శాంపిళ్లు పెద్దమొత్తంలో పట్టుబడటం ఆందోళన కలిగిస్తుంది. గత కొన్నేళ్లుగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అక్రమ ఔషధాలను మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయించి అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. బుధవారం ఒక దుకాణంలోనే రూ.10 లక్షల విలువైన ఫిజీషియన్‌ శాంపిళ్లు, కాలం తీరిన ఔషధాలు పట్టుబడ్డాయి. ఇంకా దాడులు కొనసాగితే చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చేవని చర్చించుకుంటున్నారు. పల్నాడు జిల్లా కేంద్రంలో కేవలం నాలుగు దుకాణాలతో అధికారులు సరిపెట్టారు. అన్ని మందుల దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేపట్టలేదు. జిల్లాలో సుమారు 900 ఔషధ దుకాణాలు ఉన్నాయి. హోల్‌సేల్‌ ఏజెన్సీలు, రిటైల్‌ మెడికల్‌ షాపులు, వైద్యశాలకు అనుబంధంగా ఉన్న మందుల దుకాణాల నిర్వాహకులు జాగ్రత్తపడుతూ ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడా నకిలీ, అక్రమ ఔషధాలు పట్టుబడ్డా వాటి మూలాలు నరసరావుపేటతో ముడిపడి ఉంటున్నాయి. ఇటీవల వైజాగ్‌లో అక్రమ ఔషధాలు అధికారుల దాడుల్లో పట్టుబడ్డాయి. సరఫరా మూలాలపై విచారణ జరపగా నరసరావుపేట నుంచి ట్యాబ్లెట్స్‌ వచ్చినట్లు గుర్తించారు. దీంతో డ్రగ్స్‌ శాఖ రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి నరసరావుపేటలో దాడులు నిర్వహించారు.

రాష్ట్ర అధికారి వస్తేనే కాని కదల్లేదు..

డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పి. అరుణ్‌ బాబు ఆధ్వర్యంలో మెడికల్‌ దుకాణాలపై దాడులు నిర్వహించారు. రెండు ఔషధ దుకాణాల్లో ఫిజీషియన్‌ శాంపిళ్లు, గడువు తీరిన మందులు గుర్తించారు. పల్నాడు జిల్లాలో ఫిజీషియన్‌ శాంపిళ్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని అనేక ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన ఉండటంలేదు. ఔషధ దుకాణ నిర్వాహకులు ఇస్తున్న నెలవారి మాముళ్లో లేక అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లో తెలియదు గాని మెడికల్‌ మాఫియా వైపు అధికారులు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటంలేదు. డ్రగ్స్‌ డీజీ అరుణ్‌బాబు స్వయంగా రంగంలోకి దిగితే గాని ఫిజీషియన్‌ శాంపిళ్ల గుట్టు రట్టవ్వలేదు.

రోగుల ప్రాణాలతో చెలగాటం..

ఔషధ కంపెనీలు వైద్యులకు ఉచితంగా అందించే ఔషధాలు అసలు ఏమార్గంలో మెడికల్‌ షాపులకు చేరుతున్నాయన్నది ప్రశ్నగా మారింది. కంపెనీ ప్రతినిధుల నుంచి వైద్యులకు అక్కడి నుంచి మెడికల్‌ షాపులకు చేరుతున్నాయా లేక ఇతర మార్గంలో సరఫరా అవుతున్నాయన్నది తేలాల్సి ఉంది. అక్రమ ఔషధాల సరఫరాకు ప్రత్యేక వ్యవస్థ నడుస్తున్నట్లు తెలుస్తొంది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఫిజీషియన్‌ శాంపిళ్లు వినియోగించటం ప్రాణాంతకమని వైద్యులు చెప్పుకొస్తున్నారు. గడువుతీరిన మందులు పట్టుబడటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతొంది. ఫిజీషియన్‌ శాంపిళ్లపై స్పష్టంగా నాట్‌ఫర్‌ సేల్‌ రాసి ఉన్నప్పటికీ దుకాణ దారులు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. లాభాల కోసం రోగుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారన్నా విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

పెద్ద సంఖ్యలో డీలర్లు

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద సంఖ్యలో నరసరావుపేటలో ట్యాబెట్లు సరఫరా చేసే డీలర్లు ఉన్నారు. లాభాల కోసం బ్రాండెడ్‌ కంపెనీల పోలిఉండేవాటిని తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి మందులను తీసుకొచ్చి బ్యాచ్‌ నంబర్లతో నకిలీవి తయారు చేసి మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. అలా నకిలీ మందులకు అడ్డాగా నరసరావుపేటకు చెడ్డపేరు ఉంది. అధిక శాతం జీరో వ్యాపారం చేస్తారన్నా ఆరోపణలు లేకపోలేదు.

సుమారు రెండేళ్ల క్రితం జిల్లాలోని ఓ ఫార్మాకంపెనీలో ట్రెమటాల్‌ తయారు చేసినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. బుధవారం తనిఖీలకు వచ్చిన అధికారులు ఆరోపణలు ఉన్నా ఆ కంపెనీవైపునకు వెళ్లలేదు. అనేక బ్రాండెడ్‌ మందుల కంపెనీలకు సంబంధించి నకిలీవి అక్కడే తయారు చేసినట్లు అధికారులు గతంలో గుర్తించారు. ఒక వేళ ఇప్పుడు తనిఖీలు చేసి ఉంటే అక్రమ ఔషధాలు వెలుగు చూసేవని పట్టణంలో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement