పదిమందికి పైగా విద్యార్థినులకు అస్వస్థత
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రభలిన జ్వరాలు స్థానికంగా కలకలం రేపాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల రోజు నుంచి పాఠశాలలో వరుసగా విద్యార్థులకు జ్వరాలు, కొద్దిమందికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో విద్యార్థులను గురువారం కామేపల్లిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి, సంజీవరెడ్డి నగర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్‌ఎంసీ మీటింగ్ రోజున చికెన్ పెట్టారని ఆరోజు నుంచే పిల్లలు జ్వరం, కడుపునొప్పితో బాధపడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు వైద్య శాఖ అధికారులు పాఠశాలలోనే ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. విద్యార్థులందరికీ మలేరియా నెగిటివ్ వచ్చిందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, తీవ్ర ఇబ్బందులు గానీ లేవని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ నజీర్ స్పష్టం చేశారు.


