తహసీల్దార్‌పై సర్వేయర్ దౌర్జన్యం
గురజాల ఆర్డీవో వద్ద పంచాయితీ
దాచేపల్లి: దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గురువారం కొట్లాట జరిగింది. రైతు పొలానికి సంబంధించిన అంశంపై తహసీల్దార్ జీ.శ్రీనివాస్ యాదవ్, సర్వేయర్ హనుమంతరావుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఒకరి చొక్కా ఒకరు పట్టుకున్నారు. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. నడికుడిలో ఓ రైతు పొలానికి సంబంధించి సర్వే చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ గత కొన్ని నెలలుగా సర్వేయర్ హనుమంతరావుకి చెబుతున్నాడు. సంబంధిత రైతు తరచూ సర్వే చేయలేదని ఫిర్యాదులు చేయడంతో సర్వేయర్‌ని పిలిచి మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. తహసీల్దార్ మాట్లాడుతుండగా సర్వేయర్ మీదకు దూసుకువచ్చి నెట్టేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై ఇద్దరికీ సర్ది చెప్పారు. ఈ విషయం గురజాల ఆర్డీవో దృష్టికి వెళ్లడంతో తహసీల్దార్, సర్వేయర్‌ను పిలిచి మాట్లాడారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు అవకాశం ఉన్నట్లు గురజాల ఆర్డీవో కార్యాలయం ద్వారా తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అచ్చంపేట: రోడ్డు ప్రమాదంలో ఒక ఒక మహిళతోపాటు, పాడి గేదె, దూడ మృతి చెందగా మరో దూడకు కాళ్లు విరిగిన సంఘటన మండలంలోని తాడువాయి వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తాడువాయికి చెందిన భూక్యా సక్కుభాయి గేదెలు మేపుకునేందుకు పొలం వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో గేదెలను తోలుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మాదిపాడు నుంచి వేగంగా వచ్చే వాహనం గేదెలను, సక్కుభాయిని ఢీకొట్టింది. రూ.70 వేలు విలువ చేసే గేదె, దాని దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. మరో దూడకు కాళ్లు విరికి కదలేని పరిస్థితిలో పడిపోయింది. గేదెలను తోలుకుని వచ్చే సక్కుభాయిని కూడా ఢీ కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయలపాలైన మహిళకు చెరుకుంపాలెంలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం సత్తెనపల్లి తరలించారు. సత్తెనపల్లిలో చికిత్స పొందుతూ ఆమె రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందింది. వాహనం డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. అతి వేగం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
వైద్య రంగం అభివృద్ధిపై సమీక్ష
మంగళగిరిటౌన్:మంగళగిరి, ఆటోనగర్‌లోని ఏపీఎంఎస్‌ఐడీసీ ప్రధాన కార్యాలయాన్ని గురువారం మెడికల్ – హెల్త్ సెక్రటరీ వీరపాండియన్ సందర్శించారు. చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన మౌలిక వసతులు, అభివృద్ధి కార్య క్రమాలపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్షించారు. ప్రజలకు ఆయుష్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై మాట్లాడారు.


