కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.
సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేశాం. కరోనా వంటి కష్టకాలంలో సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేశాం. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే పని లేకుండా ప్రజలకు విశేష సేవలు అందించాం. నెలకు రూ. 5 వేల గౌరవవేతనంతో పని చేసిన మమ్మల్ని తొలగించి ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో ప్రభుత్వ పని తీరును ప్రచారం చేసుకునేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదు.
– చందోలు ఝాన్సీ రాణి,
మాజీ వలంటీర్, సత్తెనపల్లి
చంద్రబాబు మాటలన్నీ నిలువెల్లా మోసమే. 2024 ఎన్నికల్లో గెలిస్తే రూ 10వేలు జీతం ఇస్తామని చెప్పి వలంటీర్లకు వెన్నుపోటు పొడిచారు. అసలు ఉన్న ఉద్యోగాలు కూడా పీకేశారు. కరోనా వంటి కల్లోల సమయంలో సైతం ప్రజల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేశాం. నమ్మక ద్రోహం చేయటం చంద్రబాబుకు కొత్తేమి కాదు. వలంటీర్లకు రూ 10వేలు జీతం ఇవ్వలేని కూటమి ప్రభుత్వం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లకు రూ.లక్షల్లో దోచిపెట్టేందుకు సిద్ధమవడం విడ్డూరం.
– పెద్దిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ వలంటీర్, గుంటూరు


