పల్నాడులో గాడి తప్పిన పోలీసు వ్యవస్థ సివిల్ పంచాయితీలకు అడ్డాగా స్టేషన్లు ఆగని హత్యలు, హింసాత్మక దాడులు బహిరంగంగా పేకాట క్లబ్బుల నిర్వహణ స్పా ముసుగులో యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు నూతన ఎస్పీ జగదీశ్ అదహళ్లిపైనే ఆశలు
కొత్త ఎస్పీకి జిల్లా వ్యాప్తంగా సమస్యల స్వాగతం
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా గురువారం బాధ్యతలు తీసుకున్న జగదీశ్ అదహళ్లికి సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. సుమారు రెండు నెలలుగా ఖాళీగా ఉన్న ఎస్పీ పోస్టులో ఓ యువ అధికారిని నియమించడంతో వీటిని అధిగమించి జిల్లా పోలీసు వ్యవస్థను గాడిలో పెడతారని ప్రజలు ఆశిస్తున్నారు.
జిల్లాలో చోటుచేసుకుంటున్న హత్యలు, హింసాత్మక దాడులు, నిత్యం జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముందస్తు నిఘా, నైట్ పెట్రోలింగ్, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరముంది. జిల్లాలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించారు. నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లోనే రోడ్డు ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయి.
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై వేధింపులకు పోలీసు వ్యవస్థను కేంద్రీకృతం చేయడంతో శాంతిభద్రతల పరిరక్షణ గాడితప్పింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మాటున కొందరు పోలీసు అధికారులు అక్రమార్జనకు తెరదీశారు. ఇందులో భాగంగా స్టేషన్లను సివిల్ పంచాయితీలకు అడ్డాగా మార్చారు. జిల్లాలో పిడుగురాళ్ల వంటి స్టేషన్లలో ఏకంగా పోలీసుల సివిల్ పంచాయితీల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. రెండున్నరేళ్లలో నలుగురు ఎస్పీలు మారడంతో పల్నాడు జిల్లా అంటేనే అధికారులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. బాధ్యతలు చేపట్టి వ్యవస్థపై అధికారులు పట్టు సాధించేలోపు రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ అవుతున్నారు. ఈ అంశం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక జిల్లాగా పల్నాడుకు పేరుంది. అంత కీలకమైన జిల్లాలో రెండున్నరేళ్లుగా శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో గాడితప్పాయి.
ఆగని హత్యలు, దాడులు...
ఎన్నికలు ముగిసిన రోజు నుంచి జిల్లాలో హత్యలు నిత్యకృత్యమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థులు, ఆస్తులు, ఆధిపత్యం కోసం తరచూ హత్యలు జరుగుతున్నాయి. శాంతి కమిటీలు వేసిన గ్రామాల్లోనే హత్యలు జరగడం గమనార్హం. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేస్తూ భయాందోళనలు కలిగిస్తున్నారు. అధికార పార్టీ గూండాలు, రౌడీలను కట్టడి చేయాల్సిన బాధ్యత కొత్త ఎస్పీపై ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. వినుకొండ పట్టణంలో పట్టపగలు మహిళలను హతమార్చి దోపిడీలకు పాల్పడిన సంఘటనలున్నాయి. దర్యాప్తులో పోలీసులు విఫలమయ్యారు.
విచ్చలవిడిగా పేకాట...
పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో బహిరంగంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. కోర్టు అనుమతి పేరుతో 24 గంటలు చట్టవిరుద్ధంగా జూద శిబిరాలు ఏర్పాటు చేయడంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. నిర్వాహకులు అధికార పార్టీకి చెందిన షాడో ఎమ్మెల్యేలు కావడంతో కొందరు పోలీసు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. స్థానిక పోలీసుల నుంచి రేంజ్ స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇస్తున్నామని నిర్వాహకులు బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. మరోవైపు స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. నిరంతరం నిఘా పెట్టి నివారణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
విచ్చలవిడిగా గంజాయి...
జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మత్తులో యువకులు జోగుతూ గొడవలు సృష్టిస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా యువత, మైనర్లను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఒకరిద్దరు వ్యసనపరులను అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. మూలాలను కనిపెట్టి ప్రధాన విక్రయదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని నరసరావుపేటకు చెందిన యువకులు బెంగళూరు నుంచి తీసుకొస్తూ చిలకలూరిపేట పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. నూతన ఎస్పీ ముందున్న మరో కీలక అంశం స్టేషన్ల పనితీరు. అధికార పార్టీ సిఫార్సు లేనిదే సామాన్యులకు న్యాయం జరగని పరిస్థితి జిల్లాలో ఉంది. కేసుల దర్యాప్తులో పారదర్శకత లోపించింది. దీంతో ప్రతి సోమవారం స్పందనకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొత్త ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


