167ఏ జాతీయ రహదారి కోసం భూములను కోల్పోయిన అన్నదాతలు పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడంపై ఆగ్రహం ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు
నరసరావుపేట రూరల్: న్యాయమైన పరిహారం అందకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాడరేవు– చీరాల 167ఏ జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు స్పష్టం చేశారు. ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ప్రచురితమైన ‘పరిహారం – పరిహాసం’ కథనంతో స్పందించిన రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులు జొన్నలగడ్డలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఎండీ హుస్సేన్, జాతీయ రహదారుల డీఈ నవాజ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. పరిహారం ప్రకటన, చెల్లింపుల విషయంలో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరం రూ.4 కోట్లు నుంచి రూ.10 కోట్ల వరకు విలువైన భూములను రహదారి విస్తరణలో తీసుకున్నారని తెలిపారు.
ఈ భూముల మీదనే తరతరాలుగా ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు నామమాత్రంగా పరిహారం ప్రకటించి రైతుల కన్నీటికీ కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.1.60 కోట్లతోపాటు వడ్డీ కూడా పరిహారం ఇస్తామని రైతులతో నిర్వహించిన సమావేశంలో గతంలో ఆర్‌డీవోగా పనిచేసిన మాధవీలత ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎకరానికి రూ.1.18 కోట్లు చొప్పునే జమ చేస్తున్నారని తెలిపారు. అధికారులు ముందుగా ప్రకటించిన విధంగా ఎకరానికి మొత్తంతోపాటు మిగిలిన మొత్తానికి వడ్డీ చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. జొన్నలగడ్డ గ్రామ రైతులకు అవార్డు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులను అన్ని విధాలుగా అధికారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసానుపల్లి వద్ద ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని రైతులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ హుస్సేన్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోని రైతులకు పరిహారం పంపిణీ చాలా వరకు పూర్తయిందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో జొన్నలగడ్డ రైతులకు ఆలస్యం జరిగినట్టు పేర్కొన్నారు. న్యాయమైన పరిహారం అందకపోతే అర్బిట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కొల్లి నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.


