నరసరావుపేట: దీపావళి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సహాల నడుమ వైభవంగా నిర్వహించు కోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన ద్వారా ప్రజలు, ఉద్యోగులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అంటే చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, అభివృద్ధి, శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. బాణసంచా కాల్చే విషయంలో చిన్న పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యరహిత పండగ జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


