కిడ్నాప్ చేసిన ఐదుగురి అరెస్ట్
నగరంపాలెం: అపహరణకు గురైన రెండు నెలల మగశిశువును ఎట్టకేలకు తల్లి ఒడికి చేర్చినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని హాల్లో శనివారం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... ఏటుకూరు రోడ్డులో గంధాల భవాని, లక్ష్మయ్య నివసించేవారని తెలిపారు. వీరికి ఆరుగురు సంతానమని, చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవారని చెప్పారు. గత నెల 30వ తేదీన వారంతా రహదారి పక్కన నిద్రిస్తుండగా, రెండు నెలల మగ శిశువు అపహరణకు గురైనట్లు తెలిపారు. గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారాం పర్యవేక్షణలో లాలాపేట సీఐ శివప్రసాద్ కేసు దర్యాప్తు చేశారన్నారు. నాలుగు బృందాలతో గాలింపు చేపట్టారని, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారని చెప్పారు. ఐపీడీ కాలనీలో నివసిస్తున్న గంగనపల్లి శ్రీనివాసరావు అలియాస్ శీను, అతని భార్య శివపార్వతి, పల్నాడు జిల్లా సింగరాయపాలెం తండాకు చెందిన ఆటోడ్రైవర్ జాతావత్ పాండునాయక్, అరండల్‌పేట 16వ వీధికి చెందిన రాతుల శివప్రసాద్, శ్యామలానగర్ 12వ వీధికి చెందిన చిలకాబత్తిని చంద్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం శిశువును తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. కొడుకు ఒక్కసారిగా కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో ఆ తల్లి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. గంగనపల్లి శ్రీనివాసరావు దంపతులకు సంతానం లేదని, శిశువును పెంచుకోవాలని భావించారని ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో ఏటుకూరు రోడ్డులో నివసిస్తున్న పిల్లలను గుర్తించారన్నారు. శ్రీనివాస్ తనకు పరిచయమున్న పాండునాయక్, శివప్రసాద్లతో శిశువు అపహరణ గురించి చర్చించాడన్నారు. పసికందును అపహరించి తీసుకొస్తే రూ.లక్ష ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రూ.10 వేలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు చెప్పారు. దీంతో మగ శిశువును అపహరించారన్నారు. శిశువును తీసుకుని దంపతులు పల్నాడు జిల్లా ముప్పాళ్ల గ్రామానికి వెళ్లారని పేర్కొన్నారు. జ్వరం రావడంతో చికిత్స కూడా చేయించినట్లు తెలిపారు.


