ఎంపీడీవో ఆఫీసు ప్రాంగణంలో కార్యాలయం ఉమ్మడి గుంటూరు జెడ్పీ నుంచి ఉద్యోగుల విభజన
నరసరావుపేట రూరల్: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోనే పల్నాడు జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటయింది. శుక్రవారం నుంచి జిల్లా పరిషత్ కార్యకలాపాలు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి గుంటూరు జెడ్పీ కార్యాలయం నుంచి 50 మంది సిబ్బందిని పల్నాడుకు కేటాయించారు. శుక్రవారం నుంచి వీరు విధులకు హాజరుకానున్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరం, ఎంపీపీ కార్యాలయం, జెడ్పీటీసీ కార్యాలయ భవనాలను జిల్లా పరిషత్ కోసం కేటాయించారు. గురువారం ఆయా భవనాలను శుభ్రం చేసే పనులు సిబ్బంది చేపట్టారు. నూతన జిల్లా పరిషత్‌కు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్ట్‌లను ప్రభుత్వం కేటాయించినా ఏవరినీ నియమించలేదు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. అవసరమైన సామగ్రి లేదు. అరకొర వసతులే సిబ్బందికి ఆహ్వానం పలుకనున్నాయి.


