ముగిసిన పాలకవర్గాల గడువు జిల్లాలోని 28 మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం
సత్తెనపల్లి: జిల్లాలో మండల ప్రజా పరిషత్తు పాలకవర్గాల గడువు బుధవారంతో ముగియడంతో 28 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. దీంతో మండల పరిషత్తులో గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. కనీసం ఏడీ హోదాలో ఉన్న జిల్లా స్థాయి అధికారులను జిల్లాలోని అన్ని మండలాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఆరు నెలలు లేదా ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరే కొనసాగనున్నారు. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక పాలన నడుస్తోంది. 2021లో జరిగిన మండల ప్రజా పరిషత్తు ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో మెజారిటీ స్థానాలు వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొన్ని మండలాల్లో టీడీపీకి బలం లేక పోయినప్పటికీ ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మండల ప్రజా పరిషత్తు పాలకవర్గాలను మార్చుకున్నారు. కూటమి ప్రభుత్వ అండదండలతో అందుబాటులో ఉన్న ఆర్థిక సంఘం, సాధారణ నిధులను సైతం అభివృద్ధి పనుల పేరుతో పూర్తిగా ఖాళీ చేశారు.
స్ధానిక సంస్ధల ఎన్నికలకు ఏర్పాట్లు...
జిల్లాలో విభజన నేపథ్యంలో 2022 ఏప్రిల్ 4న కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు ప్రత్యేకంగా జెడ్పీ కార్యాలయం సైతం ఏర్పాటు కానుంది. జెడ్పీ పాలకవర్గాల గడువు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల ఓటర్ల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించారు. పురపాలక ఎన్నికలు పూర్తి కాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం స్థ్ధానిక సంస్థల ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.


