జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో తుఫాను ప్రభావంతో మారుతున్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాలను పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ సూచించారు. బుధవారం ఒక ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలను పాటిస్తూ సహాయక శిబిరాలకు తరలివెళ్లాలని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, చెరువులు, కాలువలు, వాగులు, వరద నీటికి దూరంగా ఉండాలని సూచించారు. వరద నీటిలో నడవడం, వాహనాలతో ప్రయాణించడం చేయరాదని తెలిపారు. ఎవరైనా వర్షాలు, వరదలు, ముంపు కారణంగా అనారోగ్యానికి గురై ఏదైనా అత్యవసర వైద్య సదుపాయం అవసరమైనట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), ఆరోగ్య ఉపకేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సంప్రదించి తక్షణ వైద్య సేవలు పొందాలని సూచించారు. పాముకాట్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్ వీనం (ఏఎస్‌వీ) ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పాముకాటు సంభవించినప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా బాధితులను సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ఆరోగ్యశాఖ జిల్లా యంత్రాంగం జారీచేసే సూచనలు, హెచ్చరికలను పాటిస్తూ సహకరించాలని డీఎంహెచ్‌ఓ కోరారు.


