శాంతియుత నిరసనలో పాల్గొన్న డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డిపై అక్రమ కేసులు పెడతారా? ఒక వైద్యుడి ఇంట్లో అర్ధరాత్రి వేళ తనిఖీలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం వీటన్నింటికీ భవిష్యత్తులో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.. రాజకీయాల్లోకి వచ్చిన వైద్యుడు, వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట జరిగిన శాంతియుత నిరసనలో పాల్గొంటే ఆయనపై టీడీపీ గూండాలు దాడులు చేయడమే కాక తిరిగి ఆయన పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి నరసరావుపేటలోని ఆయన గృహంలో, వైద్యశాలలో సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టి కుటుంబ సభ్యులను, రోగులను భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదన్నారు. సుధీర్‌భార్గవ్‌రెడ్డి వైద్యుడు అని, క్రిమినల్స్ కోసం తనిఖీలు చేసినట్లు ఒక వైద్యడి ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అందర్నీ భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం అవివేకమన్నారు. డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరగాలన్నారు. విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట సోమవారం శాంతియుత నిరసన చేపడితే, ఆ నిరసనను భగ్నం చేసేందుకు టీడీపీ గూండాలు, యువగళం మూకలు వ్యవహరించిన తీరును ఆయన తప్పు పట్టారు. యువతకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, డీఎస్సీపై వచ్చిన అన్ని ఆరోపణలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎప్పుడు వినని గేమ్స్ పేర్లతో అనుమానాస్పద క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా యువగళం మూకలకు ఉద్యోగాలు కట్ట బెట్టారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అర్హత లేని వారికి లబ్ధి చేకూ ర్చారనే అనుమానాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన క్రీడాకారులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.


