నరసరావుపేట: జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించడం, ఎంఎస్‌ఎంఇ రంగాన్ని బలోపేతం చేయడం, పారిశ్రామిక యూనిట్లకు అవసరమైన ప్రభుత్వ అనుమతులను సకాలంలో అందించడం, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఇపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్, చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా పరిశ్రమల అధికారి ఎస్.వి.సురేష్ సమావేశానికి కన్వీనర్‌గా వ్యవహరించారు. సింగిల్ డెస్క్ పాలసీ కింద వివిధ శాఖల ద్వారా పారిశ్రామిక యూనిట్లకు మంజూరు చేయబడుతున్న అనుమతుల పురోగతి, పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతులను నిర్ణీత విధానం, గడువుల్లో అందించే అంశంపై చర్చించారు. జిల్లాలో వివిధ దశల్లో అమలవుతున్న పారిశ్రామిక సంస్థలు పరిశ్రమల ప్రాజెక్టుల అమలు స్థితిగతులు, యూనిట్ల స్థాపన, నిర్మాణం, యంత్రాల ఏర్పాటు, ఉత్పత్తి ప్రారంభం తదితర దశల్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం అమలు కింద వచ్చిన దరఖాస్తులు, వాటి పరిశీలన, బ్యాంకుల ద్వారా రుణ మంజూరు, పథకం అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలు పురోగతిని సమీక్షించారు. పథకం ద్వారా సంప్రదాయ వృత్తిదారులకు అందుతున్న ప్రయోజనాలు, నమోదు, తదుపరి దశల అమలుపై చర్చించారు. పలువురు జిల్లా అధికారులు, పాల్గొన్నారు.


