ఆమ్యామ్యాల తడాఖా | - | Sakshi
Sakshi News home page

ఆమ్యామ్యాల తడాఖా

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

ఆమ్యామ్యాల తడాఖా

కాసులిస్తేనే పనులు ముందుకు... జిల్లా విద్యుత్‌ శాఖలో భారీగా అవినీతి పత్తా లేని విజిలెన్స్‌ శాఖ అధికారులు ఉన్నత స్థాయి వరకు ముడుపులు లంచాలతో వినియోగదారులు విలవిల చోద్యం చూస్తున్న ఇన్‌చార్జి మంత్రి

ఇన్‌చార్జి మంత్రి జిల్లాలోనే...

అమాత్యుని ఇలాకా..

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అంటే.. ఆ జిల్లాలోని పరిపాలన మొత్తానికి ఆయనే కీలకం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలపైనా పర్యవేక్షణ ఆయనదే. కానీ గొట్టిపాటి రవికుమార్‌ ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పల్నాడు జిల్లాలో సాక్షాత్తూ ఆయన శాఖలోనే పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్నా చోద్యం చూస్తున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నామంటూ ఉపన్యాసాలకే ఆయన పరిమితం అయ్యారు. మరోవైపు ఆయన శాఖకు చెందిన అధికారులు ప్రతి పనికో రేటు కట్టి వినియోగదారుల నుంచి దొరికినకాడికి దోచుకుంటున్నారు.

నరసరావుపేట టౌన్‌: జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్‌ శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు నిరంతర విద్యుత్‌ సేవలు అందించాల్సిన శాఖలో ప్రతి పనికీ ‘రేటు’ నిర్ణయించారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు కావాలన్నా.. కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ పొందాలన్నా.. లోడ్‌ పెంచుకోవాలన్నా.. లైన్‌ మార్పులు, ఇతర సాంకేతిక అనుమతులు పొందాలన్నా మామూళ్లు లేకుండా పని జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు ముడుపుల వ్యవహారం సాగుతోందని ఆరోపిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం నిద్రావస్థలో ఉండటం అవినీతిపరులకు వరంగా మారింది.

అవినీతి అధికారికి అందలం..

విద్యుత్‌ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంపైనా ఉందని ప్రజలు అంటున్నారు. గతంలో నరసరావుపేట విద్యుత్‌ శాఖలో ఏఈగా పనిచేసిన అధికారిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కెపాసిటీని బట్టి వసూలు చేశాడు. ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిపోయి పదోన్నతి కల్పించి మరో నియోజకవర్గానికి బదిలీ చేయటం ఉద్యోగ వర్గాలతో పాటు వినియోగదారులకు విస్మయానికి గురిచేసింది. ఇప్పటివరకు అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి సమగ్ర విచారణ జరిగిందే లేదు. ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలపై మంత్రి నేరుగా దృష్టి సారించి, నరసరావుపేట విద్యుత్‌ శాఖలో పారదర్శక విచారణకు ఆదేశిస్తారా లేక ఈ ‘అవినీతి చీకట్లు’ ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.

విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్‌ శాఖ అధికారులపై ఇంత తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement