జిల్లాల వారీగా మండలాలివీ...
ఉమ్మడి జెడ్పీ ఏర్పాటు ఇలా...
పెద్ద జెడ్పీ ఇక చరిత్రే
మూడుగా మారిన
పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు
● 25 నుంచి మొదలుకానున్న
కార్యకలాపాలు
● ఉమ్మడి గుంటూరు జిల్లాలో
57 మండలాలతో జెడ్పీ
● ఇప్పుడు 17 మండలాలకు
గుంటూరు పరిమితం
● పల్నాడులో 28, బాపట్ల పరిధిలో
20 మండలాలు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కొత్తగా పల్నాడు, బాపట్ల జెడ్పీలు ఏర్పడనుండగా.. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్‌ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లా 17 మండలాలకు పరిమితం కానుంది. అదే విధంగా పల్నాడులో 28, బాపట్లలో కొత్తగా కలిసిన వాటితో కలిపి 20 మండలాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే అధికంగా మండలాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు 57 మండలాల నుంచి 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని మండలాల వారీగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న దృష్ట్యా, త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.
1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 నుంచి 1959 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. 1921 నుంచి 1927 వరకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పీజీఎన్ యతిరాజుల నాయుడు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా 1921 నుంచి 1959 వరకు తొమ్మిది మంది జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిలో కొనసాగారు. మూడు సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 1959లో అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా డిసెంబర్ ఒకటో తేదీన మేడూరి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వరకు గత 66 ఏళ్ల కాలంలో 36 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో నాలుగు సార్లు ఇన్‌చార్జ్ చైర్మన్లు, 18 సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగారు. జెడ్పీకి 16 మంది చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో కాసు వెంగళరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు తదితర ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన మోహన్ కందా గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కాలంలో జెడ్పీ ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతమున్న జెడ్పీ పరిపాలన భవనాన్ని 1964 జూలై 15న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కాకుమాను, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వట్టిచెరుకూరు ఉన్నాయి.
బాపట్ల జిల్లాలో అమృతలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కర్లపాలెం, కొల్లూరు, మార్టూరు, నగరం, నిజాంపట్నం, పర్చూరు, పిట్టలవానిపాలెం, రేపల్లె, చుండూరు, వేమూరు, వేటపాలెం, యద్దనపూడి మండలాలు ఉన్నాయి.
పల్నాడు జిల్లాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు, గురజాల, ఈపూరు, కారంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, నూజెండ్ల, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ ఉన్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్వరూపం మారింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పడనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇక నుంచి మూడు జిల్లాల వారీగా విడిపోనుంది.


