‘ఉత్త మా’ పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

‘ఉత్త మా’ పురస్కారాలు

Sep 7 2026 2:50 AM | Updated on Sep 7 2026 2:50 AM

అవార్డు పొందిన ముగ్గురు

అధ్యాపకులూ సీఎం సామాజిక వర్గమే

రాష్ట్ర స్థాయి ఎంపిక తీరు చూసి

విస్తుపోతున్న విద్యావేత్తలు

ఇతర సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు

సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధ్యాపకుల విద్యాపరమైన రికార్డుతోపాటు విద్య, పరిశోధన అంశాలనూ లెక్కలోనికి తీసుకోలేదు. వారు వ్యక్తిగతంగా కనబరిచిన ప్రతిభ, అందుకున్న పురస్కారాలు పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలు, వాటి ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న వారి జాబితా చూస్తే ఇవేమీ కనిపించవు. దీంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిపాలన, వ్యవస్థాపరమైన అన్ని పదవులు, నియామకాలన్నింటిలోనూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అగ్రతాంబూలం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వాములమైనప్పటికీ తమకు కనీస ప్రాధాన్యత కూడా ఉండటం లేదని కొన్ని సామాజిక వర్గాలు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి. కానీ అవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, ఏఎన్‌యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన అవార్డుల ప్రక్రియను కూడా ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం, ముగ్గురూ సైన్స్‌ కళాశాలకు చెందిన వారే కావడం టీడీపీ ప్రభుత్వ విపరీత ధోరణికి అద్దం పడుతోందని విద్యావంతులు మండిపడుతున్నారు.

ఆరోపణలున్నా పట్టింపేదీ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల నిర్వహణ పదవిని ‘ఉత్తమ’ అవార్డుకు ఎంపికై న ఓ అధ్యాపకుడు నిర్వర్తించేవారు. ఆయన హయాంలో యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది పరీక్ష ప్రారంభానికి ముందే బీఈడీ ప్రశ్నపత్రం లీక్‌ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీకేజీ ఘటనపై అప్పట్లో పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఓ బీఈడీ కళాశాల క్లర్క్‌ను, కొందరు ఒడిశా విద్యార్థులను నామమాత్రంగా బాధ్యులను చేసి చేతులు దులుపుకొన్నారు. పేపర్‌ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటే గతంలో ఆ పదవిలో ఉన్న వారిని యూనివర్సిటీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అధికారికి మరింత అగ్రపీఠం వేసినట్లు వ్యవహరించారు. ఆ తరువాత కూడా పీజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు తప్పుగా రావడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నపత్రాలను జిరాక్స్‌ తీసి విద్యార్థులకు ఇవ్వడం వంటి అనేక ఘటనలు ఈ అధికారి హయాంలో చోటుచేసుకున్నాయి. ఇక బోధన, పరిశోధన అంశాల్లో ఈ అధ్యాపకుడు కనబరిచిన ప్రత్యేక ప్రతిభ ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఈడీ పేపర్‌ లీక్‌ జరిగిన సమయంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం చాలా సీరియస్‌ అయ్యిందని, ఏఎన్‌యూ ఉన్నతాధికారులను నివేదిక కూడా అడిగిందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఘటన చోటుచేసుకున్న విభాగానికి చెందిన అధికారికి ఇప్పుడు అదే శాఖ నుంచి ఉత్తమ అవార్డును ప్రదానం చేయడం.. లోకేశ్‌, చంద్రబాబులకు ఉన్న సామాజిక ప్రేమను చాటి చెబుతోందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement