అశాసీ్త్రయంగా జీఎంసీ డివిజన్ల విభజన ప్రక్రియ ఇప్పటివరకు ఉన్న 57 డివిజన్లను 76కు పెంచాలని నిర్ణయం వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న డివిజన్‌లను అడ్డగోలుగా చీల్చిన వైనం అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న యంత్రాంగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్‌ల పునర్విభజన వ్యవహారం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే తెరపైకి తెచ్చిన బహిరంగ కుట్రలా కనిపిస్తోందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు ఉన్న 57 డివిజన్‌లను ఏకంగా 76కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అగ్గి రాజేస్తోంది. క్షేత్రస్థాయి భౌగోళిక సరిహద్దులు, సహజ నిర్మాణం, పరిపాలనా సౌలభ్యం, కనీస శాసీ్త్రయ ప్రమాణాలను గాలికొదిలేసి.. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లే అధికారులు జీ హుజూర్ అంటూ సరిహద్దులను గీసేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని విభజన కత్తి దూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రాంతాలను ఒక క్రమపద్ధతి లేకుండా రెండు మూడు డివిజన్‌లలోకి అడ్డగోలుగా ముక్కలు చేసి పంపించారు. అంతేకాకుండా, పలుచోట్ల సహజ హద్దులైన ప్రధాన రహదారులను కాకుండా నాలుగు అడుగుల సందులను బౌండరీలుగా చూపించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. అనేక డివిజన్‌లను ఇష్టారాజ్యంగా చీల్చి పక్క డివిజన్‌లో కలిపినప్పటికీ, కొన్ని డివిజన్‌లలో జనాభా భారీగా పెరగడం, మరికొన్నింటిలో తీవ్రంగా తగ్గిపోవడం వంటి అంతుచిక్కని లెక్కలు అధికారుల పనితీరును బట్టబయలు చేస్తున్నాయి. ఉదాహరణకు నల్లపాడు, అంకిరెడ్డిపాలెం లాంటి విలీన ప్రాంతాలను అసంబద్ధంగా కలపడం వల్ల స్థానిక ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది.
జన సైనికుల్లోనూ అసంతృప్తి సెగలు
ఈ అశాసీ్త్రయ విభజన కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోనే కాకుండా, క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామి అయిన జనసేన కేడర్‌లోనూ అసంతృప్తి రగిలిస్తోంది. తమకు పట్టున్న డివిజన్‌లు, జనసైనికుల ప్రాబల్యం ఉన్న కాలనీలను కూడా అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా చీల్చి బలహీన పరిచారంటూ జనసేన స్థానిక శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. స్వప్రయోజనాల కోసమే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ మ్యాపింగ్ చేయించారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కమిషనర్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
11 వరకు అభ్యంతరాల స్వీకరణ
ప్రస్తుతం డివిజన్‌ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 11వ తేదీ వరకు గడువు విధించారు. వచ్చిన అభ్యంతరాలను 12వ తేదీన సీడీఎంఏకు పంపడం, 13న సీడీఎంఏ తుది జాబితా ఖరారు చేసి, 14న ఫైనల్ జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అన్యాయంగా మార్చిన సరిహద్దులను సవరించాలంటూ నగరవ్యాప్తంగా నిరసన స్వరాలు మిన్నంటుతున్నాయి.


