అర్హులందరికీ ఓటు హక్కు కల్పన | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఓటు హక్కు కల్పన

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

● పారదర్శక జాబితాకు రాజకీయ పార్టీల సహకారం అవసరం ● జిల్లా పరిశీలకుడు రేవు ముత్యాలరాజు, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

జిల్లాలో 42,831 నోటీసులు పెండింగ్‌

నరసరావుపేట: డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితాలో లోపాలను సరిదిద్దుకునేందుకు రాజకీయ పార్టీలు, ఓటర్లకు నెలపాటు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకుడు, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌ రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముత్యాలరాజు మాట్లాడుతూ..అర్హులను జాబితాలో చేర్చి, అనర్హుల పేర్లు తొలగించేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి అదనంగా అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ అధికారులను నియమించినట్లు తెలిపారు. అక్టోబర్‌ 3 నాటికి పూర్తిస్థాయిలో పారదర్శక ఓటర్‌ జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యమని చెప్పారు. సెప్టెంబర్‌ 21వ తేదీలోపు జిల్లావ్యాప్తంగా నోటీసులు జారీ చేసిన అన్ని కేసుల్లోనూ విచారణ పూర్తిచేయాలని తెలిపారు.

యువతపై దృష్టి ముఖ్యం

ఈఆర్‌ఓలను ఉద్దేశించి మాట్లాడుతూ క్లెయిమ్స్‌, అబ్జెక్షన్స్‌, ఫామ్‌–6 డిస్పోజల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల యువతపై దృష్టి పెట్టి ఓటర్లుగా నమోదు చేయించాలని పేర్కొన్నారు. నోటీసుల డెలివరీ, డిస్పోజల్‌ ఆఫ్‌ హియరింగ్‌పై ప్రత్యేక దృష్టి అవసరం అన్నారు. చనిపోయిన వారి పేర్లు తగిన ఆధారాలతో మాత్రమే తొలగించాలని, పొలిటికల్‌ పార్టీలు, బీఎల్‌ఓలు చెప్పారని ఓటు హక్కు తీసివేయవద్దన్నారు.

డ్రాఫ్ట్‌ ఓటర్లు 15.49 లక్షల మంది

జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈ నెల ఒకటో తేదీన డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితా ప్రకారం 15,49,802 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. అందులో పురుషులు 7,58,339, సీ్త్రలు 7,91,312, ఇతరులు 151 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో 2,117 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని వివరించారు. జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ, ఈఆర్‌ఓలు, పులిచింతల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కె. శ్రీరాములు, పులిచింతల స్పెషల్‌ కలెక్టర్‌ పి. లీలారాణి, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఆర్‌డీఓలు కె. బాలకృష్ణ, కె. గోపాలకృష్ణ, మురళీకృష్ణ, జిల్లా సివిల్‌ సప్లయిస్‌ మేనేజర్‌ బి. నారదముని, డీఆర్‌ఓ కె. అద్దయ్య, పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన

అనంతరం స్థానిక రామిరెడ్డిపేటలోని కబేళా పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఉన్న పోలింగ్‌ స్టేషన్‌– 171ను పరిశీలించారు. ఓటర్‌ జాబితా విచారణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఆరా తీశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని కోమటినేనివారిపాలెం పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ – 251, 252 కేంద్రాలను పరిశీలించారు. ఆర్‌డీఓ కె. బాలకృష్ణ, నరసరావుపేట మున్సిపల్‌ కమిషనర్‌ బి. రమ్యకీర్తన పాల్గొన్నారు.

నరసరావుపేట: జిల్లాలో సుమారు 42,831 నోటీసుల పంపిణీ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నోటీసుల జారీ, పంపిణీ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, విచారణలు, తుది ఉత్తర్వుల జారీ తదితర అన్ని ప్రక్రియల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ హాజరయ్యారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలు, తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఫారమ్‌–6, 7, 8 దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన ఆధారాలు అందుబాటులో ఉన్న కేసుల్లో అనవసర జాప్యం లేకుండా విచారణ పూర్తిచేసి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దయ్య, ఎన్నికల అధికారుల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement