పారదర్శకంగా భూముల రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూముల రీ సర్వే

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

నూజండ్ల: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపడుతున్న రీ సర్వే ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరుగుతుందని, రైతులు అపోహలు విడనాడాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ స్పష్టం చేశారు. పువ్వాడ రెవెన్యూ గ్రామంలో 2023లో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంలో రీ సర్వే చేపట్టినప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడంతో రైతులు భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదే సమస్యపై ఇటీవల రైతులు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ సమర్పించారు. దీనిపై స్పందించిన జేసీ ఆ రెవెన్యూ గ్రామాన్ని సందర్శించారు. గ్రామసభలో రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో క్రయవిక్రయాలు జరగడం, సర్వే సమయంలో హద్దులు, కొలతల్లో తేడాలు ఉండటం వంటి విషయాలను రైతులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సరిహద్దుల వ్యత్యాసాలను సరిదిద్ది, వెబ్‌ల్యాండ్‌ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్‌ రమేష్‌కుమార్‌ను ఆదేశించారు. అవసరమైతే రీ సర్వే ప్రతిపాదనలను పరిశీలిస్తామని రైతులకు జేసీ హామీ ఇచ్చారు.

అగ్రహారం భూముల సమస్యలు పరిష్కరించండి

మండలంలోని వి.అప్పాపురం, తిమ్మాపురం గ్రామాల అగ్రహారం భూ సమస్యలను ఓ కొలిక్కి తేవాలని ఆయా గ్రామాల రైతులు విన్నవించుకున్నారు. జేసీ పర్యటనలో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సంవత్సరాలు, తరాలు మారుతున్నా భూములపై హక్కులు పొందలేకపోతున్నామని, అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే గానీ పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండప్రోలు గ్రామంలో సెటిల్‌మెంట్‌ ప్రక్రియ పూర్తయినా రైతుల సమస్యలు అలాగే ఉండిపోయాయని తెలిపారు. స్పందించిన జేసీ .. అగ్రహారం పరిష్కార చర్యలు వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ఏడీ శ్రీనివాసరావు, మండల సర్వేయర్‌ చండీరాణితో పాటు గ్రామస్తులు కుంటా కృష్ణారెడ్డి, కాకాని వీరాంజనేయులు, కంచర్ల కిరణ్‌ తదితరులు ఉన్నారు.

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement