అమరావతి: సుమారు 28 రోజులుగా గ్రామ పంచాయతీ తాగునీరు సరఫరా చేయకపోవటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై గురువారం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బాధిత మహిళలు మాట్లాడుతూ మేజర్ పంచాయతీ అమరావతి గ్రామంలోని విజయసాగర్ కాలనీ, బాబు జగ్జీవన్‌రామ్ కాలనీ, బండచేను కాలనీలతో పాటు మరికొన్ని ప్రాంతాలకు 28 రోజులుగా తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా రూ.800 చెల్లించి నీటిని కొనుగోలు చేసి కుటుంబ అవసరాల కోసం వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నుంచి తాత్కాలికంగా ఉపశమనంగా వారానికి ఒకసారి ట్యాంకర్ పంపితే ఇంటికి ప్లాస్టిక్ డ్రమ్ము నీరు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఆ నీరు ఒకరోజు వాడకానికి కూడా సరిపోవటం లేదని, అవీ దుర్వాసనతో కూడిన మురుగునీరు సరఫరా చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మురుగునీరు వాడటం వల్ల రోగాలు సోకుతున్నాయన్నారు. ట్యాంకర్ నీరు తాగటానికి పనికిరాకపోవటంతో అధిక ధరలకు మినరల్ వాటర్ క్యాన్‌లను కొనుగోలు చేయాల్సి వస్తోందని మహిళలు పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో మోటార్ల మరమ్మతులు పూర్తిచేస్తామన్నారు. తాగునీరు తప్పక సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. మోటార్ల మరమ్మతులకు దారితీసిన పరిస్థితులను వివరించటంతో మహిళలు శాంతించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి బి. సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


