నాదెండ్ల: పల్నాడు జిల్లా మేజర్ పంచాయతీ గణపవరం గ్రామంలో రెండు ఇళ్లలో భారీ చోరీ కలకలం రేపింది. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.20 లక్షలకు పైగా సొత్తు, సొమ్ము చోరీకి గురైంది. ఎస్‌ఐ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. గణపవరంలో నివాసం ఉండే గాదె శ్రీనివాసరావు 18న భార్య విజయలక్ష్మితో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కుమారుల వద్దకు వెళ్లారు. గురువారం తిరిగి ఇంటికి చేరుకున్నారు. బయటి గేటుకు తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటం, బీరువా తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలోని 14 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు అర కేజీ వెండి వస్తువులు చోరీ అయినట్లు తెలిపారు. ఇదే గ్రామంలోని శాంతినగర్‌లో నివాసం ఉండే పూజారి యనమండ్ర హనుమత్ సాయిప్రసాద్ ఈ నెల 18న ఊరికి వెళ్లారు. గురువారం ఇంటికి చేరుకొని చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. 2.5 కేజీల వెండి వస్తువులతో పాటు రూ.65 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం నరసరావుపేట క్రైంబ్రాంచ్ పోలీసులు, గుంటూరు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులకు సంబంధించిన పలు ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు గృహాల్లో రూ.20 లక్షల విలువైన సొమ్ము, సొత్తు దొంగతనం


