గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కొత్తపల్లి సుశీలను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండ్యన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈమె విజయవాడలోని ఏపీ నర్సింగ్ కౌన్సిల్ (ఏపీఎంఐసీ) రిజిస్ట్రారుగా పనిచేస్తున్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటుగా నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రారు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుశీల గతంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఉత్తర్వులు రావడంతో గురువారం రాత్రి ఆమె ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సుశీలను కళాశాల బోధనా సిబ్బంది, కార్యాలయ సిబ్బంది అభినందించారు.
23 నుంచి దరఖాస్తుల స్వీకరణ
బాపట్ల: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై వినికిడి లోపం ఉన్న విద్యార్థిని, విద్యార్థుల కోసం ప్రభుత్వం డిగ్రీ కళాశాల మంజూరు చేసిందని విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎస్.వెంకటరవనప్ప తెలిపారు. వారికోసం రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇదని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో 30 సీట్లతో ఏఐ సర్టిఫికేషన్ కోర్సుతో బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రధాన సబ్జెక్టుగా) కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. వివరాలకు 90000 13633, 99483 72899 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
నరసరావుపేట రూరల్: భారత పారా మిక్స్‌డ్ హాకీ జట్టు కోచ్‌గా ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో ఎంపీఎడ్ అభ్యసిస్తున్న పి.రాజేశ్వరి ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు బెల్జియం, నెదర్లాండ్‌లో జరిగే పారా హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు రాజేశ్వరి కోచ్‌గా వ్యవహరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా బురిడికంచారానికి చెందిన రాజేశ్వరి చిన్న వయస్సులోనే హాకీ క్రీడ ఆటడం ప్రారంభించింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చింది. అనంతరం కోచ్‌గా, అంపైర్‌గా నైపుణ్యాలను మెరుగు పర్చుకుంది. బీపీఎడ్, పీజీ డిప్లోమా ఇన్ యోగా, ఎన్‌ఐఎస్ హాకీ కోర్సు, హాకీ ఇండియా లెవల్–1 కోచింగ్ కోర్సు, ఎఫ్‌ఐహెచ్ అంపైరింగ్ లెవల్–1తో పాటు పలు కోర్సులను పూర్తి చేసింది. ఈ ఏడాది ఫరీదాబాద్‌లో నిర్వహించిన స్పెషల్ ఒలింపిక్స్ భారత్ హాకీ ప్రిపరేటరీ క్యాంప్‌నకు ఏపీ చోచ్‌గా వ్యవహరించింది. అనంతరం భారత పారా మిక్స్‌డ్ హాకీ జట్టు కోచ్‌గా ఎంపికైంది. రాజేశ్వరిని ఎంఏఎం కళాశాల చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు, అధ్యాపకులు అభినందించారు.
పెదకాకాని: శివాలయంలో శ్రావణమాస పర్వదినం రెండో శుక్రవారం భ్రమరాంబ అమ్మవారిని పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనం కోసం ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3వ శుక్రవారం చీరల అలంకారం, 4వ శుక్రవారం ఉచిత సాముహిక శ్రావణమాస వరలక్ష్మి వ్రతములు, లక్ష గాజుల అలంకారం, 5వ శుక్రవారం నెమలి పించముల అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారన్నారు. అధికసంఖ్యలో భక్తులు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మవారికి పసుపుకొమ్ముల అలంకరణ చేపట్టనున్న నేపథ్యంలో పలువురు భక్తులు గురువారం పసుపు కొమ్ములు మాలలు కట్టే పనుల్లో నిమగ్నమయ్యారు.


