నమ్మితే విలవిల! | - | Sakshi
Sakshi News home page

నమ్మితే విలవిల!

Aug 14 2026 7:32 AM | Updated on Aug 14 2026 7:32 AM

నమ్మితే విలవిల! దళారుల మాటలకు మోసపోతున్న తల్లిదండ్రులు, యువత ల!

రూ.లక్షల్లో వసూలు చేసి చేతులెత్తేస్తున్న వైనం ఎస్పీ కార్యాలయంలో ప్రతి వారం ఇదే తరహా ఫిర్యాదులు ఏడాది కాలంలో 73 ఫిర్యాదులు అందినా దక్కని న్యాయం

ఉద్యోగాల ఆశ చూపి

ముంచేస్తున్న మాయగాళ్లు

కొలువుల వల..
దళారుల మాటలకు మోసపోతున్న తల్లిదండ్రులు, యువత

సాక్షి, నరసరావుపేట : బొల్లాపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి గత సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చారు. చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఏలూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పరిచయమై రైల్వే శాఖలో టీసీగా ఉద్యోగం ఇప్పిస్తానని రూ.18 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఉద్యోగం ఎంతకూ రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని డబ్బులు అడగ్గా ఇవ్వనని అతడు బెదిరించాడని వాపోయారు. పోలీసులకు చెబుతాననడంతో రంగంలోకి దిగిన నిందితుడి తండ్రి తొలి వాయిదా కింద రూ.6 లక్షలు అందజేసి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నాడట. మిగిలిన డబ్బులిమ్మని అడిగితే మొత్తం చెల్లించామని, నీ సంతకంతో కూడిన పేపర్లు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నాడట. దీంతో చేసేదేమీ లేక బాధితుడు అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఇది ఒక్క బొల్లాపల్లికి చెందిన యువకుడి కథే కాదు. కొలువులు వస్తాయన్న ఆశతో వందలాది మంది యువత, తల్లిదండ్రులు మాయగాళ్లకు డబ్బులు చెల్లించి మోసపోతున్నారు. తీరా చూస్తే ఉద్యోగం రాక, ఇచ్చిన నగదు వెనక్కి రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే ఉద్యోగం సాధించలేకపోగా, ఇలా డబ్బులు పోగొట్టుకున్నారని సమాజంలో తెలిస్తే పరువుపోతుందని మౌనంగా ఉండిపోతున్నారు.

పెరుగుతున్న ఫిర్యాదులు

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు 73 మంది ఉద్యోగాల పేరిట మోసపోయామని ఫిర్యాదులు అందాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య ఎక్కువ ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల, చిలకలూరిపేట రూరల్‌, నరసరావుపేట రూరల్‌, నరసరావుపేట టూటౌన్‌, పిడుగురాళ్ల స్టేషన్ల పరిధిలో ఎక్కువగా జాబ్‌ పేరిట మోసాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కష్టాన్ని నమ్ముకొని నైపుణ్యం పెంచుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని, దళారుల మాటలకు మోసపోవద్దని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

జాబ్‌ పోర్టళ్ల ద్వారా గాలం...

చంద్రబాబు ప్రభుత్వం ఇటు ఉద్యోగాలు, అటు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్న యువత తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ఉన్న వివిధ జాబ్‌ పోర్టల్స్‌లో దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు ఫేక్‌ ప్రొఫైల్స్‌తో నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ వీసా, వర్క్‌ పర్మిట్‌ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు రూ.లక్షలకు లక్షలు తీసుకొని ఫేక్‌ జాయినింగ్‌ లెటర్లు అందజేసి ఉడాయిస్తున్నారు. కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి ఉద్యోగాలు వచ్చినట్టు నమ్మించి కొన్ని టాస్క్‌లు అప్పగించి వారితో పనిచేయిస్తున్నారు. తొలుత చిన్న మొత్తంలో నగదు జమ చేసి, మరింత పెద్ద ఉద్యోగం కోసమంటూ భారీ స్థాయిలో నగదు తీసుకుంటున్నారు. బంధుమిత్రులను చేర్పిస్తే కమీషన్‌ అంటూ ఆశ చూపి మరింత మందిని మోసం చేసి, ఫోన్లు, వెబ్‌సైట్లను నిలిపేసి జెండా ఎత్తేస్తున్నారు. ఈ తరహా సైబర్‌ నేరాల బారిన పడిన వారు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వారం వారం వస్తున్నారు. బాధితులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. కంపెనీ ఉద్యోగం ఇచ్చేముందు నగదు చెల్లించాలని కోరదనే విషయాన్ని మొదట నిరుద్యోగులు గుర్తిస్తే మోసపోయే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement