మరణించినా.. జీవించొచ్చు! | - | Sakshi
Sakshi News home page

మరణించినా.. జీవించొచ్చు!

Aug 13 2026 1:51 AM | Updated on Aug 13 2026 1:51 AM

మరణించినా.. జీవించొచ్చు!

అవయవదానంతో ఇతరులకు నూతన జీవితం ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తే ఎందరికో మేలు నేడు వరల్డ్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే

గుంటూరులో కేంద్రాలు

ఏ అవయవాలు దానం చేయవచ్చు

గుంటూరు మెడికల్‌: మనిషి చనిపోయినా అవయవదానం చేయటం వల్ల ఎనిమిదిమందికి నూతన జీవితాన్ని ఇవ్వటంతోపాటుగా మరణించి కూడా జీవించి ఉండొచ్చు. ప్రతిరోజూ జిల్లాలో 30 మందికి పైగా వివిధ రకాల వ్యాధులతో, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో, ఇళ్ల వద్ద మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి కౌన్సెలింగ్‌ చేసి అవయవదానం చేయించటం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. అవయవదానంపై ప్రజలకు అవగాహన లేకపోవటం, మూఢనమ్మకాలతో చనిపోయిన వారి భౌతిక కాయాన్ని కాల్చి బూడిద చేయటం లేదా మట్టిలో పూడ్చిపెట్టడం చేస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజూ ఎంతో మంది ఆస్పత్రుల్లో వివిధ రకాల రోగాలతో, రోడ్డు ప్రమాదాలతో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. చనిపోయిన వారి అవయవదానం వల్ల పలు మరణాలను నివారించవచ్చు. ప్రతిఏడాది ఆగష్టు 13న ‘వరల్డ్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

అవయవాల కోసం ఎదురుచూపులు

అవయవాలు చెడిపోయి ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అందుకోసం జీవన్‌ధాన్‌ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్‌ధాన్‌ తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల కోసం, లివర్‌ మార్పిడి, గుండె మార్పిడి, లంగ్స్‌ మార్పిడి ఆపరేషన్ల కోసం అనేక మంది దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం వేయి కళ్లతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే వీరు ప్రాణాలు కోల్పోతారు. ఆపరేషన్లుకు అయ్యే ఖర్చులు భరించలేక జీవన్‌ధాన్‌ పథకంలో పేర్లు నమోదు చేయించుకోని కిడ్నీ బాధితులు, గుండెజబ్బు బాధితులు అధికంగానే ఉన్నట్లు సమాచారం.

ఎంత సమయం పడుతుంది...

మానవ శరీరంలోని ఉపయోగపడే అవయవాలు బ్రెయిన్‌ డెడ్‌ కేసు నుంచి బయటకు తీసేందుకు ఐదు గంటల సమయం పడుతుంది. అవయవాలు సేకరించిన పిదప గుండె, లంగ్స్‌ను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్‌ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుండి 18 గంటల్లోపు అమర్చాలి. లేని పక్షంలో సేకరించిన అవయవాలు పనిచేయకుండా పోతాయి. కళ్ళు చాలా కాలం నిల్వ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవభాగాలను ‘యూ డబ్ల్యూయూ సొల్యూషన్‌’ అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్‌బాక్సుల్లో భద్రం చేసి అవయవాదనం కోసం ఎదురు చూస్తున్నవారికి అమర్చుతారు.

ఎలా రిజిస్టర్‌ కావాలి...

అవయవదానం చేయాలనుకునే వ్యక్తులు ముందస్తుగా తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసినవారందరికి తాను అవయవదానం చేస్తున్నట్లు తెలియజేయాలి. ఇలా తెలియజేయడం వల్ల సదరు వ్యక్తి చనిపోయిన పిదప అతని కోరిక మేరకు వారి తల్లిదండ్రులు, లేదా, బంధువులు, లేదా కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్‌దాన్‌ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. www.jeevandan.gov.in వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్‌ డోనార్‌ కార్డును అందజేస్తుంది.

గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన ఉప్పు ఏడుకొండలు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుండెజబ్బుసోకి గుండెమార్పిడి ఆపరేషన్‌ చేస్తేనే బతుకుతాడని వైద్యులు నిర్ధారించారు. అదే సమయంలో విజయవాడలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏడుకొండలు అనే వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌ అవ్వటంతో అతడి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. సీనియర్‌ గుండెమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే 2016లో గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్‌ చేశారు. గుండె మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న గుంటూరుకు చెందిన ఏడుకొండలు పదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ హాయిగా జీవితం సాగిస్తున్నాడు.

జీవన్‌ధాన్‌ పథకం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఉంది. గుంటూరు జిల్లాలో గుంటూరు జీజీహెచ్‌, వేదాంత హాస్పిటల్‌, అశ్విని హాస్పిటల్‌, రమేష్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌, శ్రీలక్ష్మీ సూపర్‌స్పెషాలిటీ, ఎన్‌ఆర్‌ఐ, కాటూరి, మణిపాల్‌, శివ, సురక్ష, ఆదిత్య, గుంటూరు కిడ్నీ అండ్‌ మల్టీ స్పెషాలిటీ, విశిష్ట, డీవీసీ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది.

మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్‌, జీర్ణ వ్యవస్థలోని ఫ్యాంక్రియాస్‌, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement