పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట రూరల్: వాతావరణ ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కోరా రు. ఎల్‌నినో నేపథ్యంలో ప్ర త్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని శంకరన్ కాన్పరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, ఉద్యాన అధికారి వెంకట్రావు, డ్వామా పీడీ సిద్ద లింగమూర్తి, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి పాల్గొన్నారు. రైతన్న మీ కోసం కార్యక్రమం ద్వారా ఈ పోస్టర్లను రైతులకు చేరవేసి వారిని సన్నద్దం చేయడంతో పాటు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయడమే కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ సంజనా సింహ
పిడుగురాళ్ల: పల్నాడు ప్రాంత రైతులకు మేలు జరిగే విధంగా రైతు బజారును ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వి.సంజనా సింహ అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు ఎదురుగా రైతు బజారు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతు బజారుకు సంబంధించిన స్థలం మార్కెట్ యార్డు పరిధిలో లేదని, ఆర్‌అండ్‌బీ అధికారులను సంప్రదించి అనుమతులు తీసుకొని రైతు బజారు ఏర్పాటు చేసే విధంగా చూడాలని ఆదేశించారు. రోడ్డుకు పార్కింగ్ స్థలం ఉంచి రైతు బజారు గదులు నిర్మాణం చేయాలన్నారు. వాష్‌రూమ్‌లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా మార్కెట్ యార్డులో గతంలో హాస్పిటల్ నిర్వహించిన ప్రాంతాన్ని విశ్రాంతి గదులుగా ఉపయోగించుకునే విధంగా చూడాలన్నారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఉపేంద్రకుమార్, ఆర్‌డీఓ మురళీ, తహసీల్దార్ మధు, కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
మాచర్ల పట్టణంలో..
మాచర్ల: పట్టణంలోని రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ బుధవారం పరిశీలించారు. కేసీపీ అతిథి గృహం ప్రాంతానికి వెళ్లే రహదారి, నిత్యసహాయ మాత ఎదురు ప్రదేశంలో రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదన స్థలంపై ఆరా తీశారు. ఆమె వెంట ఆర్‌డీఓ మురళీ కృష్ణ, తహసీల్దార్ బి.కిరణ్‌కుమార్ ఉన్నారు.


