సీన్ కట్ చేస్తే.. అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకుంది. ప్రజాసేవకు ఏమాత్రం ఉపయోగపడని ఒక భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు సిద్ధమైంది. కేవలం సర్కారుకు డప్పు కొట్టేందుకే వారికి భారీ నజరానాలు ప్రకటించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమాన్ని పంచిన గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లుగా ముద్రవేశారు.. వారికి ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే వారిని అవస్థల పాల్జేసి.. ఆ వ్యవస్థనే లేకుండా చేశారు.
కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధ్యతగా పనిచేశాం. కూటమి ప్రభుత్వం మాకిచ్చిన బహుమతి ఇదేనా? మా సేవలను నిస్వార్థంగా అందించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 వేలు వృథా ఖర్చు అన్నారు. ఇప్పుడేమో ఇంటిలో కూర్చొని వీడియోలు చేస్తే రూ. లక్షలు ఇస్తామంటున్నారు. ఇది వృథా ఖర్చు కాదా ? గెలిస్తే ఉద్యోగాలు ఉంచుతామని చెప్పి ఇప్పుడు నడి రోడ్డులో వదిలేశారు.
– తుమ్మలపెంట విజయదుర్గ, సోపిరాల, బాపట్ల జిల్లా
వలంటీర్‌గా పనిచేసిన సమయంలో ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకునేవారం. ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా గ్రామస్థాయిలో సేవ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఆ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలకు దూరమైన భావన కలుగుతోంది. ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది. మాకు మాత్రం తీవ్ర అన్యాయం చేసింది.
– కొండ్రు సూర్య, కాకుమాను, గుంటూరు జిల్లా


