గుంటూరువెస్ట్(క్రీడలు): స్థానిక విద్యానగర్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూలులో మూడు రోజుల నుంచి జరుగుతున్న పాఠశాల స్థాయి ఖోఖో జాతీయ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్–19 విజేతగా ఉత్తరప్రదేశ్, అండర్–17 విజేతగా ఆంధ్ర, తెలంగాణ, అండర్–14 విజేతగా కర్నాటక, గోవా జట్లు నిలిచాయి. అనంతరం బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిషఫ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య మాట్లాడుతూ 15 రాష్ట్రాల నుంచి వచ్చిన 600 మంది చిన్నారులు అద్భుత ప్రదర్శన కనబరిచారన్నారు. తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సవరి, అంతర్జాతీయ షూటర్ ముఖేష్ నేలవల్లి, కోఆర్డినేటర్ థెరిస్సా తదితరులు పాల్గొన్నారు.


