సీఎం సభలో మంత్రి ఫొటో మాయం | - | Sakshi
Sakshi News home page

సీఎం సభలో మంత్రి ఫొటో మాయం

Oct 5 2026 1:03 AM | Updated on Oct 5 2026 1:03 AM

సీఎం సభలో మంత్రి ఫొటో మాయం తెనాలి టౌన్‌: రూరల్‌ మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభ ప్రాంగణంలో అనేక అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సభా వేదికపై స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఫొటోను ప్రొటోకాల్‌ అధికారులు ఏర్పాటు చేయడం మరిచారు. విషయాన్ని తెలుసుకున్న జనసేన నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆగమేఘాలపై అరగంట తరువాత మంత్రి మనోహర్‌తో కూడిన ఫొటోను వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై పొందుపరిచారు. హెలీప్యాడ్‌ ప్రాంగణానికి వెళ్లేందుకు ఆ గ్రామ రైతులు, టీడీపీ ముఖ్య నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి, చివరకు చేసేది లేక అక్కడి నుంచి నిష్క్రమించారు. ఒకానొక దశలో టీడీపీ మహిళా నాయకురాలు ఎన్నిసార్లు హెలీప్యాడ్‌ ప్రాంగణానికి వెళ్లాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కష్టపడి పనిచేసే వారికి ఇటువంటి అవమానాలు తప్పవని సీనియర్‌ నాయకుల ఎదుట ఒకింత అసహనం వ్యక్తం చేసింది. హెలీప్యాడ్‌ ప్రాంగణానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంటే, దాదాపు 80 మంది వివిధ మార్గాల గుండా రావడంతో ఎన్‌ఎస్‌జీ కమెండోలు పలువురిని పక్కకు తోశారు. వీరిలో జనసేన నాయకులు ఉన్నారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు త్రీడీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో శంకుస్థాపన చేసి సభా ప్రాంగణానికి వెనుదిరిగి వచ్చారు. ఒంటి గంట దాటినా ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభం కాకపోవడంతో కొంతమంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. గ్యాలరీల దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనేక అపశ్రుతుల మధ్య చంద్రబాబు బహిరంగ సభ కొనసాగింది. సభ ముగియడంతో ప్రజలు ‘బతికిపోయాంరా బాబు’ అంటూ బయటకు వచ్చారు. తీవ్ర ఉక్కపోత, ఎండ తట్టుకోలేక సభకు వచ్చిన ప్రజలు ఇబ్బందిపడ్డారు.

మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు

సభా ప్రాంగణంలో సుమారు నాలుగు వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేయడంతో అక్కడకు వచ్చిన కొందరికి కుర్చీలు లేక కొద్దిసేపు నిలబడి వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు చెట్ల కింద టీడీపీ జెండాలు పట్టుకుని నిరీక్షించారు. ఎర్రటి ఎండలో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొందరు చేసేది లేక సభ ప్రారంభం కాకుండానే వెనుదిరిగి వెళ్లారు. మండలం నుంచి 50 బస్సులు, పట్టణంలో 13 బస్సులు ఏర్పాటు చేయగా, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలను ఆ బస్సుల్లో తీసుకురావాలని, 8 గంటల కల్లా ప్రాంగణంలో ఉండాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో ఆ విభాగాల్లో పనిచేసే అధికారులు పది గంటల వరకు జనం రాకపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.

● సభా వేదికపై మంత్రి నాదెండ్ల చిత్రాన్ని

విస్మరించిన నిర్వాహకులు

● హెలీప్యాడ్‌ ప్రాంగణం వద్ద రైతులు,

తెలుగు తమ్ముళ్లను అడ్డుకున్న పోలీసులు

● తగినన్ని కుర్చీలు లేక పోవడంతో సభ

ప్రారంభం కాకుండానే వెళ్లిపోయిన జనం

● మధ్యాహ్నం ఒంటి గంట దాటినా

ప్రారంభం కాని చంద్రబాబు ప్రసంగం

● హెలీప్యాడ్‌ వద్ద జనసేన నేతలతో

ఎన్‌ఎస్‌జీ కమెండోల దురుసు ప్రవర్తన

ఆలస్యంగా సీఎం ప్రసంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement