జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ జారీచేసి వెంటనే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యాలయం నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఖాళీ పోస్టులు, సివిల్ పనుల పురోగతిపై డీజీహెచ్‌ఎస్‌లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవల అధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మాట్లాడారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై వెళ్లి విధులకు హాజరుకాని సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, వారి స్థానంలో నోటిఫికేషన్ జారీచేసి అర్హులైన వారిని నియమించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్‌లను బయట చేయించుకోవాలని ఎవరైనా సూచించినా, సిఫార్సు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. చిలకలూరిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జనరేటర్ కాంపౌండ్ వాల్ పనులు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. బ్లడ్ బ్యాంక్ పునర్నిర్మాణం, ఎక్స్‌రే రూమ్ పనులను రెండు నెలల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌ను తొలగించి, కొత్త కాంట్రాక్టర్‌ను నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో కొత్తగా ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులను తొమ్మిది నెలల్లోగా పూర్తిచేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన అన్ని పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించాలని అన్నారు. ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల కింద చికిత్స పొందిన రోగులకు సంబంధించిన ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయా అనే అంశంపై కలెక్టర్ ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఫీజుల చెల్లింపులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
స్పెషల్ ఇంటన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఈ నెల 31లోగా నోటీసుల డెలివరీ 100శాతం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లాలో ఇంతవరకు 2,46,600 (100 శాతం) నోటీస్‌లను జెనరేట్ చేశామని, 67,527మందికి డెలివరీ అయ్యాయని, మొత్తం ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. అమరావతిలోని రాష్ట చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఎలక్షన్‌్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సర్ ప్రక్రియ జిల్లా ప్రగతిని వివరించారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు ఇప్పటి వరకు ఫారం–6కు సంబంధించి 1504 అందాయని, ఇందులో ఇప్పటి వరకు 762 పూర్తయ్యాయని,. ఫారం–7కు సంబంధించి 17, ఫారం–8కు సంబంధించి 1055 క్లెయిమ్స్ ఉన్నాయని వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 22, 23, 29, 30న ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు, ఎన్‌జీఎస్‌పీ, బుక్ ఎ కాల్ విత్ బీఎల్‌ఓ పెండింగ్ పనుల స్థితితో సహా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మాపింగ్‌కాని, మాపింగ్‌లో వ్యత్యాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీచేసి నోటీసులను ఓటర్లకు నేరుగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఏ కె.అద్దెయ్య, ఆర్‌డీఓలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


