బొల్లాపల్లి: మూతబడిన బండ్లమోటు మైనింగ్ నుంచి ముడి ఖనిజాల అక్రమ తరలింపును బుధవారం అర్ధరాత్రి అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం బండ్లమోటు గ్రామ సమీపంలో హిందుస్థాన్ లెడ్ జింక్ లిమిటెడ్ కంపెనీ 1969 నుంచి 2002 వరకు మైనింగ్ నిర్వహించింది. ఆ తర్వాత నిలిపివేసింది. మూతపడే సమయానికి కొన్ని వేల టన్నుల సీసం, డోలమైట్ నిల్వ ఉంది. ఈ పౌడర్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 2013లో అటవీశాఖ అధికారులు మైనింగ్ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరచూ ఈ ప్రదేశం నుంచి కొందరు అక్రమార్కులు ముడి ఖనిజాలను తరలిస్తున్నారు. వినుకొండ రేంజ్ అటవీ శాఖ అధికారి సి.మాధవరావు ఆధ్వర్యంలో నిఘా పెట్టి, దాడులు చేశారు. మైనింగ్ ప్రదేశంలో సీసం 80 నుంచి 100 సంచుల్లో, డోలమైట్ పౌడర్ 80 నుంచి 100 సంచుల్లో నింపి ఉంచారు. బుధవారం అర్ధరాత్రి దాడులు చేయగా అక్రమార్కులు తప్పించుకుని పరారయ్యారని, సంచుల్లో నింపి ఉన్న ముడి ఖనిజాలను స్వాధీన పరుచుకున్నట్లు రేంజ్ అధికారి తెలిపారు.


