నా జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటన ఇది ఎల్లో మీడియా దుష్ప్రచారం మానుకోవాలి అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన నవులూరి చెన్నారెడ్డి హత్య అత్యంత దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని చెప్పారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని, నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామన్నారు. మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డితో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తమ కుటుంబానికి 35 సంవత్సరాలుగా సీనియర్ నాయకుడు భాస్కర్‌రెడ్డి అత్యంత ఆప్తుడని చెప్పారు. ఆయన కుమారుడు నవులూరి చెన్నారెడ్డిని అత్యంత పైశాచికంగా చంపడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజాయతీగా, నీతిగా రాజకీయాల్లో ఉండాల్సిన నాయకులు అత్యంత దుర్మార్గంగా, అసత్యాలను ప్రచారం చేస్తూ, ఎల్లో మీడియాలో తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి పరోక్ష ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కథనాలు రాయడం దారుణమన్నారు. ఇందుకు కారణమైన అశోక్‌రెడ్డిని, అభియోగాలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వరరెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు.
ఎల్లో మీడియా తీరు దారుణం
ఇటువంటి ఘటనలను ఎవరు ప్రోత్సహించినా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని, అప్రమత్తంగా వ్యవహరిస్తూ కారకుడు ఎవరైనా క్షమించే ప్రసక్తే లేదన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. సీనియర్ నాయకుడైన భాస్కర్‌రెడ్డికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కూటమికి అనుకూలమైన ఎల్లో మీడియా తన తమ్ముడిపై దుష్ప్రచారం చేయడంలో భాగంగా అత్యంత దారుణంగా కథనాలు రాయడం క్షమించరాని విషయమన్నారు. తమ పార్టీలో గ్రూపులు లేవని తెలిపారు. వైఎస్ జగన్ కోసం పార్టీ ఉంటుందని... ఆయన నాయకత్వంలో నడుస్తుందని అన్నారు. మనస్పర్థలు పెట్టుకుని ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, అందరూ పార్టీ కోసమే పనిచేయాలని చెప్పారు. ఎల్లో మీడియా ఇప్పటికై నా దుష్ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
తప్పుడు ప్రచారం సరికాదు
పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. చెన్నారెడ్డి హత్యను రాజకీయం చేయడం అత్యంత దారుణమన్నారు. మనిషి చనిపోయి తామంతా ఆవేదనలో ఉన్న సమయం ఇదన్నారు. కానీ చెన్నారెడ్డి మామ, బంధువులు ఆవేశంతో మాట్లాడిన మాటలను ఆధారం చేసుకుని పిన్నెల్లి వెంకటరామిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. పచ్చ మీడియా పచ్చకామెర్లు వచ్చిన తరహాలో తప్పుడు కథనాలను రాయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. కూటమి నాయకుల చర్యలను కూడా తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను తెలుసుకుని హత్య వెనుక అసలు కుట్రను ఛేదించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. చెన్నారెడ్డి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు.


